Dilip Reddy:
‘కొన్నిసార్లు మా వికెట్లు కూడా బుమ్రా పుణ్యమే’ అన్న సిరాజ్ నిజాయితీని అభినందించాలి. ‘ప్రపంచంలోని ఏ జట్టయినా సరే…. పిడుగుల్లాటి అతని ఆరు బంతులను ఊపిరి బిగబట్టి ఆడే మేటి బ్యాటర్లూ, అవతలిపక్క మా బౌలింగ్ వచ్చే సరికి కాసింత గాలి పీల్చుకుందామనే ఏమరుపాటులో, మాకు వికెట్లుగా దొరికిపోతారు’ అంటాడు సిరాజ్!
నిజమే, ఎంత చక్కని లైన్ & లెంత్ బౌలింగ్! అంత షార్ట్ రనప్ తోనూ నిప్పులు చెరిగే బంతులు….. రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజీలాండ్) చివరి రోజుల్ని గుర్తుకు తెస్తున్నాడు బుమ్రా. ఆటను సైన్స్ ల్యాబ్ లో రసాయన పరీక్షంత నిష్ట, మైదానంలో ఆఖరి బంతి వరకూ తరగని ప్రతిభ-వృత్తినైపుణ్యం చూపే ఆస్సీ మేటి బ్యాటర్లనూ నాల్గవ టెస్ట్, నాలుగో రోజు, ఆదివారం గజ గజ వణికించాడంటే అతిశయోక్తి కాదు. ఫ్రంట్ లైనర్రు-మిడిలార్డర్ అంతా ఓ ముఫ్ఫై ఓవర్లపాటు ఊపిరి బిగబట్టి, చెమట్లు కక్కారు. బుమ్రాకు సిరాజ్ సహకారం తోడవడంతో, వంద పరుగుల్లోపే టప టప టప మని ఆరు వికెట్లు రాలిపోయాక కూడా… ఆస్ట్రేలియా టేలెండర్స్ చూపిన సహనం, తెగువ అసాధారణం. 10వ, 11వ నంబర్ బ్యాటర్లుగా వచ్చిన లియోన్, బొలార్డ్ లు, చెరో 54, 65 బంతులు ఎదుర్కోవడమే కాక చివరి వికెట్ కు, ఇప్పటికే 50 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని జోడించారు. చూపరులంతా ఇక ముగింపు ఇప్పుడా, అప్పుడా అనుకుంటున్న తమ రెండో ఇన్నింగ్స్ ను వారెంతో సమర్థంగా ఆట అయిదో రోజుకు నెట్టగలిగారు. అక్కడైనా, ఇక్కడైనా… ఇరు జట్లలో ఇప్పుడాలోచించాల్సింది సీనియర్లే! “విఫలమవుతున్న సీనియర్” అనిపించుకొని కొనసాగటం కన్నా…. “గొప్పగా ఆడుతూనే ఆట ఆపేశాడు”అనే కీర్తితో రిటైరవడమే రోహిత్ శర్మ లాంటి వారికి మంచిది. ఎందుకంటే, యువత అలా రాణిస్తోంది. వారసత్వాన్ని అన్ని డిపార్టుమెంట్లలో అందిపుచ్చుకుంటూ దూసుకువస్తోంది మరి! కొత్తనీరు పాత నీటినీ తరలిస్తుంది సహజమే కద!
‘వండే’ (ODI) లనూ మరిపిస్తూ టీ-ట్వంటీ, పదేసి ఓవర్ల (Ten a side) మ్యాచ్ ల వైపు క్రికెట్ కుంచించుకు పోతున్న ఈ రోజుల్లో “అయిదు రోజుల టెస్ట్ మ్యాచ్ ఎవరండీ చూస్తారు?” అనే పెదవి విరుపులకు ధీటైన జవాబు చెబుతున్నారు అనుభవాల పెద్దలు, ప్రతిభ గల కుర్రాళ్లు.
నిన్న ఆస్సీ బౌలర్లు vs నితీష్ కుమార్ రెడ్డి అయినా, ఇవాళ ఆస్సీ బ్యాటర్లు vs బుమ్రా అయినా… కనువిందైన ‘బ్యాట్-బాల్ మధ్య సంఘర్షణ’కు ఆట అద్దం పడుతోంది కనుకే….. ఒక్కో రోజు 80వేల మందితో నిండుతున్న మెల్బోర్న్ స్టేడియం క్రిక్కిరిసి, విశ్వవ్యాప్తంగా కోట్ల మంది టీవీక్షకులకు ‘కిక్కి’స్తోంది!
దటీజ్…. టెస్ట్ క్రికెట్!!
Oh! Test Cricket Long Live