నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్.ఆర్.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి నుంచి వైదొలగడమా? అన్నది లోకేష్ చేతుల్లో, చేతల్లోనే ఉంది. అందుకు ఈ పాదయాత్ర అసలుసిసలు కార్యక్షేత్రం… ఇది ఆయనకు ఒక అగ్నిపరీక్ష.
ట్విటర్, ఫేస్ బుక్, జూమ్ మీటింగ్ లను దాటుకొని ఎట్టకేలకు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడానికి నారా లోకేష్ సిద్ధపడటం ప్రజాస్వామ్యపరమైన శుభపరిణామం! ఏ పార్టీ నాయకులైనా సరే,వారు ప్రజల దగ్గరకి వెళ్లడాన్ని అందరం హర్షించాల్సిందే, స్వాగతించాల్సిందే. ఇందులో తప్పు పట్టడానికేమీ ఉండదు. విద్యార్థులు లైబ్రరీకి వెళ్లి జ్ఞానాన్ని పొందినట్టు, రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి వారి మనోభావాలు తెలుసుకోవడం ద్వారా జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. రాజకీయనాయకులు ప్రజలవద్దకు వెళ్ళినప్పుడు తాము మాట్లాడటం కంటే వారు చెప్పే విషయాలను, వారి సమస్యల్ని, వారి వినతుల్ని ఓపికగా వినడం వల్లనే ఇది సాధ్యమవుతుంది.
యువగళం పాదయాత్ర కేవలం జగన్ ని తిట్టడానికే అయితే, ఈ పాదయాత్ర అవసరమే లేదు. ప్రతీనిత్యం ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం ఏసీ గదుల్లో నుండి గత మూడున్నర సంవత్సరాలుగా చేస్తున్న పని ఇదే. ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో ప్రెస్ మీట్ పెట్టి తిడితే, ఆ తిట్లు ఆన్‌లైన్ లో గ్రామ గ్రామానికి క్షణాల్లో వెళ్ళిపోతాయి. జనం మనోగతాన్ని గాలికొదిలి మూడున్నరేళ్లుగా అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రధానప్రతిపక్షం తెలుగుదేశం తలమునకలయింది కూడా ఈ పనిలోనే! యువగళం పాదయాత్ర రాజకీయ కర్తవ్యాన్ని ఈ పాదయాత్ర దారి మళ్లించాలి, అప్పుడే దానిలక్ష్యం నెరవేరుతుంది.
యువతకు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో వారి హక్కులు, సమస్యల గురించి పోరాటం చేయడమే నేపథ్యంగా లోకేష్ ఈ పాదయాత్రకు ‘యువగళం‘ అని పేరు పెట్టారు. పాదయాత్ర పేరు పాజిటివ్ గానే ఉంది. కానీ, ఈ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ యువకుల సమస్యలపై ఎలా పోరాటం చేస్తారు? సమస్యలకు ప్రత్యామ్నాయంగా తానేమైనా పరిష్కారాలు చూపిస్తారా? యూత్ పాలసీ ఏదైనా ప్రజల ముందు పెడతారా? అన్నవే కీలక ప్రశ్నలు. ‘భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంద’ని నాడు మహాత్మాగాంధీ చెప్పినట్టుగా, పరిస్థితులు ఇప్పుడలా లేవు. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక పొట్ట చేతబట్టుకొని ప్రజలు పట్టణాలు, నగరాలకు వలస బాట పడుతున్న పాడు కాలమిది. ఇలాంటి సమయంలో లోకేష్ అనేక గ్రామాల్లో నడవబోతున్నారు. గత ప్రభుత్వంలో లోకేష్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వారికోసం ఏమేం పనులు చేశారో చెప్పడంతో పాటు, భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి ఏం చేయగలరో చెప్పగలగాలి. వలస వెళ్లిన ప్రజలు తిరిగి పల్లె గూటికి మళ్లేలా ‘తిరోగమన వలస’ (రివర్స్ మైగ్రేషన్)ల ప్రోత్సాహానికి తనవద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ప్రాక్టికల్ గా చెప్పగలిగిన రోజే ఆయనపై విశ్వసనీయత పెరుగుతుంది. యువగళానికి సార్థకత లభిస్తుంది.
యువగళం పాదయాత్ర లోకేష్ కు ఓ అగ్నిపరీక్ష. తండ్రి చంద్రబాబు ప్రాపకంతో నేరుగా దిగివచ్చిన ప్యారాచూట్ నాయకుడని పేరున్న లోకేష్ తనను తాను ఒక రాజకీయ నాయకుడిగా నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దానికి ఈ పాదయాత్రే ఒక గీటురాయి కావాలి.1995 సంక్షోభ సమయంలో ఎన్టీ రామారావుని గద్దెదించి, చంద్రబాబు నాయుడు తనను తాను ఒక నాయకుడిగా మలచుకున్నారు. సినీగ్లామర్ కింగ్‌గా రాజకీయాల్లోకి దిగిన దివంగత నేత నందమూరి తారకరామారావు లాగా తనకెలాంటి గ్లామర్ లేకున్నా… 24/7 కష్టపడి రాజకీయాల్లో అందలాలెక్కడం చంద్రబాబుకు తెలిసిన పరిశ్రమ. దాంతోటే, 1999లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చి తిరుగులేని నాయకుడిగా తనకు తాను నిరూపించుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌ని ఏర్పర్చుకొని, పార్టీ చిరునామను ‘‘నందమూరి’’ నుంచి ‘‘నారా’’ గా మార్చడంలో విజయం సాధించారు.
యువగళం పాదయాత్రతో ఇప్పుడు మళ్లీ ‘‘నారా’’, ‘‘నందమూరి’’ మధ్య పోలికను రాజకీయ విశ్లేషకులు, రాజకీయనాయకులు తీసుకొచ్చే పరిస్థితి నెలకొన్నాయి. నారా లోకేష్ ఏం చేసినా, జూనియర్ ఎన్టీఆర్ తో పోలిక తీసుకురావడం ఖాయం. యువగళం పాదయాత్ర ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రానీకుండా, అతడిని మరిపించేలా ప్రజల్ని ఆకట్టుకోవడం లోకేష్ ముందున్న పెద్ద సవాల్! ఒకవేళ ప్రస్తుత పాదయాత్ర ద్వారా తానొక బలమైన నాయుకుడిననే సంకేతాలు ప్రజల్లోకి పంపలేకపోతే పార్టీలో నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మొగ్గు చూపే అవకాశాలతో పాటు ఆయన మద్దతుదారులు తమ గొంతు పెంచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అదే నారా, నందమూరి లలో ఏది చెల్లుబాటు అవుతుందో తేటతెల్లం చేస్తుంది.
కుప్పంలో జనవరి 27న ప్రారంభమయ్యే యువగళం పాదయాత్ర, 400 రోజులు, 4 వేల కిలోమీటర్లు సాగుతుంది. రోడ్డు పట్టుకుని నడిచే రాజకీయ పాదయాత్రలన్నీ పవిత్రమైనవో, గొప్పవో అని తీర్మానించడానికి లేదు. కోవిడ్ సంక్షోభ సమయంలో లక్షలాదిమంది పేదలు పొట్ట చేత పట్టుకొని వందల కిలోమీటర్ల్లు నెత్తురోడే పాదాలతో నడిచారు. అలాంటి బీదబిక్కి ప్రజలను కలవడానికి, 39 ఏళ్ల యువ నాయకుడైన లోకేష్ రోజుకు పది కిలోమీటర్లు నడవడం మాత్రమే ఘనమైన విషయం అనిపించుకోదు.
2003లో ప్రజా ప్రస్థానం పేరుతో జరిపిన పాదయాత్రలో దివంగత నేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 68 రోజులపాటు దాదాపు 1600 కిలోమీటర్ల మేర నడిచారు. అది కూడా 55 ఏళ్ల వయసులో 45 డిగ్రీల మండు వేసవిలో రోజుకు సగటున 24 నుంచి 28 కిలోమీటర్లు నడుస్తూ, ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ… జననేతగా ఎదిగారు. 2013లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ 208 రోజుల పాటు సుమారు 2,400 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 63 ఏళ్ల వయసులో ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులకు వెరవకుండా రోజుకు సగటున 12 కిలోమీటర్ల కంటే ఎక్కువే నడిచారు. అదే సమయంలో వైఎస్సార్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల.. ‘మరో ప్రజా ప్రస్థానం’ పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 230 రోజుల పాటు దాదాపు 3, 200 కిలోమీటర్లు నడిచిన మొట్ట మొదటి మహిళా నేతగా షర్మిల తన పట్టుదలను చాటారు. రోజుకు 14, 15 కిలోమీటర్ల చొప్పున మండుటెండలో నడిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో మొత్తం 341 రోజుల్లో సుమారు 3,500 కిలోమీటర్లు నడిచారు. అంటే రోజుకు సగటున పదిన్నర కిలోమీటర్లు నడిచారంతే! అంటే దివంగత నేత డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, షర్మిలా చేపట్టిన పాదయాత్రలతో పోలిస్తే… యువ నాయకులైన జగన్ చేసిన పాదయాత్ర, లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర, నడక విషయంలో అంత గొప్పవేం కాదు.
దివంగత నేత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించడానికి చంద్రబాబు హిందూపురం లో పాదయాత్ర మొదలుపెట్టారు. దివంగత నేత డా.వైఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కొనసాగించడానికి ఆయన కుమారుడు వై.ఎస్.జగన్ ఇడుపులపాయ నుంచి, ఆయన కుమార్తె శ్రీమతి షర్మిల ఇడుపులపాయ, చేవేళ్ల నుంచి పాదయాత్రలు మొదలుపెట్టారు. ప్రస్తుతం నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెడుతూ తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననే సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పాదయాత్రను రాయలసీమలో మొదలుపెట్టడం కూడా ఒక సవాలే. రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది 2019 ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలు మాత్రమే. ఆ ముగ్గురూ కూడా ఒకే సామాజికవర్గానికి చెందినవారే! కేవలం తమ సామాజికవర్గం వారినే అందలమెక్కిస్తారనే ప్రచారాన్ని తిప్పికొడుతూ సామాజికన్యాయంపై దృష్టి సారించి, దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలను, మైనార్టీలను ఆకట్టుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్ భుజస్కంధాలపై ఉంది. 2019లో యువత పూర్తిగా వైసీపీ వైపు నిలబడిరదని దేశంలోని ప్రముఖ సంస్థ లోక్‌నీతి, పీపుల్స్‌పల్స్ సంస్థ ఇంకా అనేక రీసెర్చ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యువతను తిరిగి టీడీపీ వైపు ఆకట్టుకోవడానికి ‘యువగళం’ కేంద్ర బిందువు లోకేష్ దగ్గర పకడ్బంధి ప్రణాళికలు ఉన్నాయా? ఇది కాలమే నిర్ణయిస్తుంది.
యువగళం పాదయాత్రలో ‘‘స్వడబ్బా’’, ‘‘పరడబ్బా’’ కొట్టుకోవడం లోకేష్ మానుకోవాలి. ఎంతసేపూ మా నాన్న అది చేశారు, ఇది చేశారు అని చెప్పడం వల్ల తాను వెలగకపోగా మరింత చులకన అయిపోతారు. జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో మీడియా, సోషల్ మీడియా పాత్ర పెరిగిపోయిన ఈ కాలంలో ఆచితూచి అడుగెయ్యాలి. ఏ మాత్రం తప్పటడుగులు వేసినా, నవ్వులపాలు కావడం ఖాయం. ‘లోకేష్ మాట మీద నిలబడరు, ఫోన్ లో అందుబాటులో ఉండరు’ అనే ప్రచారం కూడా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్లో బలంగా ఉంది. రాజకీయ జీవితంలో ఈ ‘బ్యాడ్ అండ్ వీక్ ఇమేజ్’ ని పోగొట్టుకోవడానికి యువగళం పాదయాత్ర లోకేష్ కి అందివచ్చిన సువర్ణ అవకాశం.
సినిమాల్లోలాగా రాజకీయాల్లోకి, లేని పెద్దరికాన్ని పనిగట్టుకొని ఆపాదించే ‘‘బాబు కల్చర్’’ కు దూరంగా ఉండాలి. తెలుగుదేశం నాయకులు వారి స్వార్థం కోసం, రాజకీయ లబ్ధికోసం లోకేష్ ని లోకేష్ అనకుండా ‘లోకేష్ బాబు’ అంటూ హైప్ ఇద్దామనుకుంటే, అది ఆయన్ని మరింత పాతాళంలోకి పడవేయడమే అవుతుంది. ‘‘బాబు కల్చర్’’ తో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడం కుదరదు. అది సమానత్వానికి ప్రతీక కాదు, ప్రతికూలం! తెలుగుదేశం పార్టీ నేతలు, దానికి అనుకూల మీడియా ‘‘చక్రం’’ తిప్పడమనే మాట కూడా తరచుగా వాడుతుంటారు. ఆయనేం చక్రం తిప్పక్కర్లేదు, పార్టీ పునాదులు నిలుపుకుంటే చాలని గ్రహించాలి. బడుగు బలహీనవర్గాల వారికి రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా దివంగత నేత ఎన్టీఆర్ సామాజిక విప్లవాన్ని ముఖ్యంగా రాజకీయరంగంలో తెలుగునాట తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. దివంగత నేత ఎన్టీఆర్ ఆ తరువాత చంద్రబాబునాయుడు పార్టీ కోసం పడ్డ శ్రమ వల్లే దేశంలోనే ఒక ప్రాంతీయపార్టీ ఇన్ని సంవత్సరాలపాటు నిలదొక్కుకుంది. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మరోసారి అలాంటి కొత్తతరం నాయకులను తయారు చేసే గురుతర బాధ్యత లోకేష్ నెత్తినెత్తుకుంటారా? లేదా? అన్నది ఈ యాత్రతో తేలాల్సిందే!
తండ్రి నీడలో తనయుడు ఎదగడం…. విషయంలో, 2012లో ఉత్తరప్రదేశ్ లో కూడా అచ్చంగా ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పటి దాకా ఎన్నికల ఫేస్ ములాయం సింగ్ యాదవ్ కాగా, ఫలితాలొచ్చాక కుమారుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ కూడా ఈ సారి తండ్రి చంద్రబాబు నాయుడే ఎన్నికల ఫేస్ గా ఉన్నారు. లోకేష్ ని తన వారసుడిగా చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ ఇప్పటిదాకా తండ్రి చాటు బిడ్డగా చంద్రబాబు నీడనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పదవినీ అదే యోగ్యతతో అందుకున్నారు తప్ప, నాయకత్వ సామర్థ్యం వల్ల కాదు. ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ నాయకుడి అర్హత సాధించాలి. అదేదో వాణిజ్య ప్రకటనలో ‘డబ్బులు ఊరికే రావు’ అన్నట్టుగానే, నాయకత్వం ఊరికే రాదు. అందుకు లోకేష్ కష్టపడాలి. 24 గంటలూ, 365 రోజులు ప్రజా జీవితంలో ఉండాలి. చంద్రబాబునాయుడు అలా కష్టపడ్డారు కాబట్టే, నందమూరి కుటుంబాన్ని కాదని నారా కుటుంబానికి టీడీపీ కార్యకర్తలు అండగా నిలబడ్డారు.
వై.ఎస్.జగన్ కి కాంగ్రెస్ ఓటు బ్యాంకు, దివంగత నేత డా.వైఎస్‌ఆర్ నిర్మించిన యంత్రాంగం కలిసివచ్చినట్టే, లోకేష్ కి కూడా ప్రత్యేకమైన టీడీపీ ఓటు బ్యాంకు, ఎన్టీఆర్ నిర్మించి, చంద్రబాబు నిలబెట్టిన పార్టీ యంత్రాంగం ఉంది. కార్యకర్తలు, నాయకులున్నారు. 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. ఇవి
వై.ఎస్. జగన్, వై.ఎస్.ఆర్.సి.పి. వైపు జారిపోకుండా ఒడిసి పట్టుకోగలిగితే చాలు, లోకేష్ పాదయాత్ర, అందుకు ఉద్దేశించిన లక్ష్యం నెరవేరినట్టే! చివరగా ఒకమాట… ఈ పాదయాత్ర ఏదో ‘హైటెక్ ఈవెంట్ మేనేజ్ మెంట్’లాగ తయారైతే మాత్రం, కాళ్లు, కీళ్ళ నొప్పులు తప్ప ఫలితం శూన్యం. 2018 ఎన్నికలకు ముందు సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఇంకా అనేక మంది నాయకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కేవలం పాదయాత్రతో అధికారం నడిచి రాదని గుర్తెరగాలి. అధికార పార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకత మాత్రమే కోరుకునే వారందరినీ గెలుపు తీరానికి చేర్చలేదు. కొత్త ఆశలు, ఆకాంక్షలు రేపుతూ, ప్రత్యామ్నాయ సామాజికార్థిక ఎజెండాను జనం ముందు పెడుతూ, నమ్మదగిన విశ్వాసాన్ని వారిలో కలిగిస్తూ … అన్ని వర్గాల ప్రజల్ని టీడీపీ వైపు ఆకట్టుకోవాలి. దూరమైన కార్యకర్తల్ని పార్టీతో తిరిగి అనుసంధానం చేయాలి. తెలుగువారి ఆత్మ గౌరవం, సామాజిక న్యాయం అంటూ ఎన్టీఆర్ అందించిన సిద్ధాంతాల వారసత్వాన్ని కొనసాగించాలి. పాదయాత్రే అగ్నిపరీక్షగా ప్రజాక్షేత్ర కొలిమిలో కాగి, లోకేష్ తనకు తాను మేలిమి బంగారమై తేలాలి. రాబోయే 30 సంవత్సరాల తన రాజకీయ భవిష్యత్తుకు లోకేష్ నిర్మించే పునాది ఈ పాదయాత్ర. పునాది పటిష్టతను బట్టే లోకేష్ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది.
=======================
-అమరవాజీ నాగరాజు,
సెల్‌నెం: 9100311069