Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తహశీల్దార్ల ‘ భూ’ లీలలు..

Nalgonda: గత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో పాత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో పనిచేసిన తహశీల్దార్లు ప్రజా ప్రతినిధులు.. అధికారుల అండ చూసుకుని  చేసిన అక్రమాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ  భూములను సైతం అక్రమంగా కాజేసారన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో.. వారు బండారం బయటపెట్టాలని బాధితులు పట్టుదలగా ఉన్నట్లు ఉమ్మడి జిల్లాలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు తహశీల్దార్లు బదిలీల విషయంలోనూ తమ పరపతిని ఉపయోగించి.. అనువైన ప్రాంతాలలో పోస్టింగ్ వేయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో  అందినకాడికి దోచుకొని..వారికి ఊడిగం చేసిన ఎమ్మార్వోలపై కాంగ్రెస్ మంత్రి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు వినిపిస్తోంది. త్వరలోనే భూములు కోల్పోయిన  బాధితులు స్థానిక మంత్రిని కలిసి తమ గోడును వెళ్ళబోసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

లిటిగేషన్ ఉన్న భూములపై కన్నేయడం, తర్వాత రెండు వర్గాల్ని పిలిపించుకోవడం ఆ తర్వాత సెటిల్ మెంట్లు చేయడం ఇదే పనిగా కొందరు తహశీల్దార్లు ఆటాడుకున్నారు. బాధితులతు ఆటాడుకుంటూ లక్షల్ని పోగేసుకున్నారు. అలా కొందరు తహశీల్దార్లు ఉమ్మడి జిల్లాలో కోట్లకు పడగెత్తారు. ధరణి ఉన్న సమయంలోను అధికారాలు లేకున్నా సామాన్యుల దగ్గర ముక్కుపిండి వసూల్లు చేసారు. 

అక్రమంగా సంపాదిస్తున్న అధికారుల్ని కాపాడేందుకు గత ప్రభుత్వంలో కొందరు పెద్దలు వెనకేసుకూ వచ్చినట్లు ఆరోపణలున్నాయి. పైసలు, పైరవీలు లేనిదే పని కాదంటే తహసీల్దార్ల అక్రమ సంపాదన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

మరోవైపు అధికారుల అండతో పోస్టింగులు మార్పు చేసుకున్న  తహసీల్దారుల జాబితాను సేకరించే పనిలో భూములు కోల్పోయిన బాధితులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.తమ నోటి కాడి బుక్క లాక్కుపోయిన  అధికారాలను ప్రజలు ముందు నిలబెట్టి తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయాలనే పట్టుదలతో బాధితులు ఉన్నట్లు జిల్లాలో చర్చ జరుగుతుంది.

 

Optimized by Optimole