తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి బేగం పేట విమానాశ్రయం చేరుకున్న షాకు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఆతర్వాత నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లిన అమిత్‌షాకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం అమ్మవారికి షా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీజేపీ కార్యకర్త ఇంట్లో టీ పార్టీ …
ఉజ్జయిని అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత సాంబమూర్తినగర్‌లోని బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు అమిత్‌షా. ఈ క్రమంలో కేంద్రమంత్రికి సత్యనారాయణ కుటుంబసభ్యులు స్వాగతం పలికారు. అక్కడ వారితో అరగంట ముచ్చటించిన షా తేనీరు సేవించి బేగంపేటకు బయల్దేరారు. అనంతరం రమదా మనోహర్ హోటల్ లో రైతు నేతలతో సమావేశమయ్యారు. ఈభేటిలో తెలంగాణలో ఫసల్ బీమా అమలుకాకపోవడం..వరి కొనుగోళ్ల వివాదం వంటి విషయాలను చర్చించినట్లు తెలిసింది.
సమరభేరిలో సమరశంఖం పూరించనున్న షా..
మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మునుగోడు సమరభేరి సభకు చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు అమిత్ షా. ఈనేపథ్యంలో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు కమలం నేతలు. స్టేజిపై భారీ ఎల్ ఈడీ స్కీన్ తో పాటు వర్షం వచ్చిన కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. ఈసభలో సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు కౌంటర్ ఇవ్వనున్నారు అమిత్ షా. అనంతరం ఉప ఎన్నికకు సమరశంఖం పూరించి.. కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.
బాద్ షాతో అమిత్ షా భేటి..
మునుగోడు సభ అనంతరం నటుడు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్‌షాతో భేటీ కానున్నారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్‌లో సాయంత్రం అమిత్ షా తారక్ భేటిని కమలం నేతలు ధ్రువీకరించారు. అయితే ఏయే అంశాలపై ఇరువురు భేటి అవుతున్నారన్నది తెలియరాలేదు. వీరి భేటి తర్వాత కమలం పార్ఠీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు కేంద్రమంత్రి. ఈభేటిలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.