మునుగోడు సమరభేరి సభ ‘నభూతో నభవిష్యతీ ‘..

ఊహించిందే నిజమైంది. ఎక్కడ చూసిన ఎవరి నోట విన్నా..ఒకటే నినాదం .. ఒకటే మాట.. జైతెలంగాణ.. భారత్ మాతాకీ జై . దారులన్ని కాషాయ రంగు పులుముకున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో బీజేపీ మునుగోడు సమరభేరి సభను విజయవంతం చేశారు కాషాయం నేతలు. అనంతరం పదునైన మాటలతో అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరికతో ఆధునిక నిజాం కేసీఆర్ పతనం మొదలైందంటూ  కాషాయం నేతలు ప్రసంగాలతో దంచేశారు. ముఖ్యంగా చీప్ గెస్ట్ అమిత్ షా మాట్లాడుతుంటే.. కార్యకర్తల స్పందన చూసి అవక్కావడం నేతల వంతైంది.

కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో పారేసేందుకు మునుగోడు ఉప ఎన్నిక రంభమన్నారు అమిత్ షా. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం ఖాయమని  ధీమావ్యక్తం చేశారు. మజ్లిస్‌కు భయపడే విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చితీరుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరుపుతామన్నారు.గతంలో కేసీఆర్ చేసిన హామీలను ప్రస్తావిస్తూ తనదైన పంచులతో సభను హెరెత్తించారు అమిత్ షా.

ధర్మయుద్ధం..
కాగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.ఉపఎన్నిక కేసీఆర్ అహంకారానికి మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని తేల్చిచెప్పారు . తాను స్వార్థం కోసం పార్టీ మారలేదని..నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేశానని మరొక్కమారు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ను గద్దె దింపి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఆర్కు నిద్రపట్టడం లేదు..
తాను అమిత్ షాను కలిసి వచ్చిన నాటి నుంచి కేసీఆర్ కు నిద్రపడ్తలేదని అని అన్నారు రాజగోపాల్.బాయిల కాడ మోటర్లకు మీటర్లు పెడ్తరని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు.రాష్ట్రంలో పాలన అవినీతిమయంగా మారిందని.. కేసీఆర్ దోచుకున్నదంతా కక్కిస్తామని రాజగోపాల్ హెచ్చరించారు.

నిండు మనసుతో ఆశీర్వదించడండి..
మునుగోడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాడని.. ప్రజలు ఇచ్చిన ధైర్యంతో పదవి వదులుకున్న ఆయనను నిండు మనసుతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభ్యర్థించారు. మునుగోడు గడ్డ మీద బీజేపీ గెలిస్తే బంగాళాఖాతంలో వేస్తరని కేసీఆర్ చెప్పుకుంటున్నడని.. అది తప్పకుండా జరిగితీరుందని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. నాలుగో ఆరును(రాజగోపాల్ రెడ్డి) గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. మోటార్లకు మీటర్లు పెట్టాలని జీవో ఇచ్చారా ? పార్లమెంట్ లో బిల్లు పాసైందా ? లేదో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.దుబ్బాక, హుజురాబాద్ లో బీజేపీ గెలిచిందని.. అయితే అక్కడ బావుల దగ్గర మీటర్లు పెట్టారా ? అంటూ రఘునందన్ ప్రశ్నించారు.
బంపర్ మెజార్టీతో గెలుస్తాడు..
బీజేపీని చూస్తే సీఎం కేసీఆర్ కు నిద్రపడ్తలేదని.. మునుగోడు ఉప ఎన్నికలో బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి .రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోనే ముంపు గ్రామాల్లోని వారికి పరిహారం, రోడ్లు వేయడం, పెన్షన్ లు ఇస్తున్నారన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. కేసీఆర్ పాలనను అంతమొందించి రామరాజ్యం తీసుకురావాలన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్. తెలంగాణకు న్యూక్లియర్ బాంబ్లా కేసీఆర్ తయారయ్యారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. దిమాక్ ఉన్నవాళ్లు ఎవరూ కూడా కేసీఆర్ ను సపోర్ట్ చేయరని తనదైన శైలిలో ఆరోపించారు ఫైర్ బ్రాండ్ విజయశాంతి.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వనందుకు .. కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్ గా మిగిల్చి.. వేల కోట్ల డబ్బులన్నీ జేబులో వేసుకున్నందుకు కేసీఆర్ ను సమర్ధించాలా అంటూ ఆమె నిప్పులు చెరిగారు.

మొత్తంమీద మునుగోడు గడ్డపై బీజేపీ సమరభేరి సభ నభూతో నభవిష్యతీ అన్నట్లుగా జరిగింది. ఇదే ఊపుతో చేరికలతో పాటు ప్రచారాన్ని వేగవంతం చేసి ఉప ఎన్నికలో గెలవాలని కాషాయం నేతలు పట్టుదలతో ఉన్నారు. ఇక్కడి గెలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాపై పట్టుసాధించేందుకు వీలుంటుందని బీజేపీ యంత్రాంగం భావిస్తోంది.