తెలంగాణ గడ్డపై దండు పుట్టిందిరో … తెలంగాణ వచ్చినా మా గోస తీరలేదురో ..

ప్ర‌త్యేక వ్యాసం :

డా. గంగిడి మనోహర్‌రెడ్డి,
ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ
ప్రముఖ్‌, ప్రజా సంగ్రామ పాదయాత్ర

____________________________

మరో ఉద్యమం :

ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయాలపై ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆనాడు వస్తే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చూపెడుతున్న వివక్షతకు నిరసనగా మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో జరగబోతోంది. 2014 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేవలం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధి ఫలాలు అందిస్తూ ఇతర నియోజకవర్గాలను ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను పూర్తిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై వివక్షత చూపడం రాజ్యాంగ ఉల్లంఘనే.

రాజీనామా ఎందుకు చేశారో కళ్ళ ముందు సాక్షాత్కారం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారతాయని సకల జనులు, సబ్బండ వర్గాలు ఎంతో ఆశపడ్డారు. అయితే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో కేవలం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారి కుటుంబసభ్యులు, వారి బంధువులు మాత్రమే బాగుపడ్డారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన సబ్బండ వర్గాలకు, సకల జనులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఫలాలు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలంటూ కొందరు అమాత్యులు ఇటీవల వేస్తున్న ప్రశ్నలకు మునుగోడు ప్రజలు ధీటుగానే సమాధానమిస్తున్నారు. ఇంకా సంవత్సరం కాలం పైగా ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉన్నా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో ఈ రోజు ప్రజల కంటి ముందు సాక్షాత్కారం అవుతుంది. దానికి నిదర్శనం ఆఘమేఘాలపైన సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం లభించడమే. 

తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి సాధ్యమైతదని దుబ్బాక, హుజూర్‌నగర్‌,  నాగర్జునసాగర్‌, హుజురాబాద్‌ ఎన్నికలతో తెలిసొచ్చింది. ఇది అత్యంత దురదృష్టకరం. రాజీనామా చేస్తేనే మునుగోడు అభివృద్ధి సాధ్యం అన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాటలు, వాస్తవానికి ఈ రోజు నిజమైతున్నయ్‌. ఆయన రాజీనామా చేశాకే డిరడి లిఫ్ట్‌ నిర్వాసితులకు రూ.116 కోట్లు, చేనేత బీమాపై చలనం వచ్చింది, మునుగోడులో రోడ్లు, బ్రిడ్జీలకు రూ.7 కోట్లు, అంగన్‌ వాడీ భవనాలు, యువజన సంఘాల భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులకు క్లియరెన్స్‌ వచ్చింది. సీసీ రోడ్లకు ప్రతిపాదనలు వస్తున్నయ్‌. మిషన్‌ భగీరథ పనులు మొదలైతున్నయ్‌. మునుగోడు నియోజకవర్గంలో 9 వేల ఆసరా పెన్షన్లను కొత్తగా మంజూరు చేశారు. సర్పంచుల పాత బిల్లులకు మోక్షం లభిస్తున్నది. పెండిరగ్‌ లో ఉన్న హామీలూ క్లియర్‌ అవుతున్నయ్‌. గౌడ్ల సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడం కోసం సర్వాయిపాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ ఉపఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, బిజెపి పార్టీ సాధించిన విజయాలు కావా? టీఆర్‌ఎస్‌ పక్షపాత పాలనకు ఇంతకు మించిన సాక్ష్యాలు ఏం కావాలే?   

చేతులు కట్టుకుని నిలబడితేనే పనులు..

ప్రతిపక్షంలో ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా కేసీఆర్‌ ముందు చేతులు కట్టుకుని నిలబడితేనే పనులు అవుతాయి, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాగా ఆత్మగౌరవంతో పదవులను త్యాగం చేస్తే కేసీఆర్‌ దిగివస్తారు. తెలంగాణ ఉద్యమ నినాదమే ఒక ఆత్మగౌరవ పోరాటమనే విషయాన్ని కేసీఆర్‌ విస్మరించడం ఆయన మనోవైకల్యానికి నిదర్శనం. అందుకే మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ అధికారపార్టీ గూటికి చేరినా కిమ్మనకుండా చోద్యం చూసి, చివరకు ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకులు ఈ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పై విమర్శలకు దిగుతున్నారు. రాష్ట్రంలో తమ అస్థిత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ నాయకులు తాము మునిగిపోతున్న పడవలో ఉన్నామనే వాస్తవాన్ని ఇంకా గుర్తించినట్లు లేదు. దానికి చక్కటి నిదర్శనం 2014 నుండి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించలేదు. విజయం సాధించకపోగా 2014, 2018 లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అంగట్లో సరుకులాగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడుబోయారు. స్థానిక సంస్థల ప్రతినిధులు గురించిన చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నా ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల విశ్వాసం సన్నగిల్లిందనే విషయం వారికి అర్థం కావడం లేదు. అంతర్గత ఘర్షణలతో ఆగమాగమవుతున్న కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదనే నాయకులంతా ఆ పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్‌లో లుకలుకలు వారి అంతర్గత వ్యవహారమైనా అనేక సంవత్సరాలపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదల్చుకుందో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. గత ఎనిమిదేండ్లుగా టీఆర్‌ఎస్‌తో లాలూచీ రాజకీయాలే వారిని ఈ స్థితికి తెచ్చాయనడంలో ఎవరికీ సందేహం ఉండదు. 

2014 నుండి ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్నికల్లో బిజెపి పార్టీ తమ బలం పెంచుకుంటూ పోతుంది. దానికి నిదర్శనం 2019 ఎన్నికల్లో 4 పార్లమెంటు గెలవడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడం, దుబ్బాక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం. ఈ రోజు వరకు బిజెపి పార్టీ నుండి గెలుపొందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి అమ్ముడుపోలేదన్న విషయాన్ని విజ్ఞులైన తెలంగాణ ప్రజలు గ్రహించాలి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దాష్టికాలను తట్టుకుంటూ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బిజెపి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కేవలం బిజెపి మాత్రమే.