మునుగోడులో రాజకీయం రసవత్తరంగా మారింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వివిధ మండలాల సర్పంచ్లు, ఎంపిటిసిలు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఉప ఎన్నికలో గెలిచి అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్ఎస్ కు..సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి కమలం పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలో నోటిఫికేషన్ వెలువడిన ముందే వలసలు, ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాషాయం నేతలు.. అసమ్మతి నేతలను టార్గెట్ చేసినట్లు విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
తాజాగా బీజేపీ గూటికి చేరిన టీఆర్ఎస్ ఎంపిపి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తూ బీజేపీ లోకి వలసలు మొదలవడంతో.. కారు,హస్తం పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. అటు సీఎం కేసిఆర్ సభకి రెండు రోజుల సమయం ఉండటంతో మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి భరోసా కల్పించిన వలసలు ఆగకపోవడం.. మరికొంత మంది జంపింగ్ కి సిద్దంగా ఉన్నారంటూ ప్రచారం జరుగుతుండడం టీఆర్ఎస్ పెద్దలకు మింగుడు పడడం లేదు.
ఇక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కాపాడుకోవడానికి మండలాల వారీగా నేతలను నియమించిన.. పార్టీ నుంచి వలసలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తికి టికెట్ ఇస్తారనే ప్రచారం వలసలకు కారణమని ఆ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ వైఖరిపైనా నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్ట పడ్డ వాళ్ళను వదిలేసి కొత్త వారికి టికెట్ ఇస్తే పార్టీకి మరింత నష్టం జరగడం ఖాయమని నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.