రసకందాయంగా మునుగోడు రాజకీయం.. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు?

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే బీజేపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలో చేరికలతో పాటు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు చేరికల కన్వీనర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనతో పాటు మరికొంతమంది ముఖ్యనేతలు బీజేపీలోకి రాబోతున్నారని వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ తో టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లో కలవరం మొదలైంది. దీంతో అప్రమత్తమైన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు క్యాడర్ చేజారిపోకుండా నియోజకవర్గంలో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ఇక ఈనెల 21 న చౌటుపల్ లో జరగబోయే బహిరంగ సభకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు బీజేపీ నేతలు. కేంద్రహోమంత్రి అమిత్ షా సభకు హాజరవుతుండటం.. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ,కాంగ్రెస్ ముఖ్య నేతలు బీజేపీ లో చేరుతుండటంతో భారీ జనసమీకరణపై కమలనాథులు దృష్టిసారించారు. అటు రాజగోపాల్ రెడ్డి తన అనుచరవర్గంతో భారీస్థాయిలో బీజేపీలో చేరేందుకు సిద్ధవుతున్నారు. ఈసభ వేదికగా ఉప ఎన్నిక సమర శంఖాన్ని పూరించి..నియోజకవర్గ అసంతృప్త నేతలు తమ వైపు తిప్పికోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అటు అధికార టీఆర్ఎస్,.. చౌటుపల్ ఎంపీపీ బీజేపీలో చేరడంతో అలెర్ట్ అయ్యింది. బీజేపీ సభ కంటే ముందే సీఎం కేసీఆర్ సభ ఉండటంతో మంత్రి జగదీష్ రెడ్డి.. అక్కడే మకాం వేసి  తొందరపడి నిర్ణయాలు తీసుకొవద్దని అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. మండలాల వారిగా నేతలతొ సంప్రదింపులు జరిపి ప్రజాదీవెన సభకు తరలిరావాలని కోరుతున్నారు.

కాగా ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా వ్యాపారవేత్త తెరమీదకు రావడంతో నియోజకవర్గ ముఖ్యనేతలు పార్టీని వీడుతున్నారు.దీంతో అప్రమత్తమైన అధిష్టానం మండలాల వారిగా కమిటినేతలను నియమించింది.తాజాగా నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో సీనియర్ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి క్యాడర్ చేజారిపోకుండా ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్,బీజేపీ సభలు ఉండటంతో..ముఖ్య నేతలు పార్టీని వీడుతారాని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరగుతోంది.

ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీలో చేరికలు , సభలతో బీజేపీ నేతలు జోష్ లో ఉండగా.. క్యాడర్ చేజారిపోకుండా టీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలు బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు .