మునుగోడు బైపోల్ ఆలస్యం కానుందా.. బీజేపీ అదే కోరుకుంటుందా?

అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యంగా జరగనుందా? కాంగ్రెస్ కంచుకోట మునుగోడులో ఆపార్టీని బలహీనపరిచి దుబ్బాక, హుజురాబాద్ తరహాలో టీఆర్ఎస్ ,బీజేపీ మధ్యే పోటీ జరగాలని కమలనాథులు కోరుకుంటున్నారా? డిసెంబర్ లో జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌, గుజరాత్ ఎన్నికల్లో గెలిచి.. జనవరిలో ఉప ఎన్నికకు వెళ్తే ఓటర్లపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని కాషాయం నేతలు భావిస్తున్నారా? ఉప ఎన్నిక ఆలస్యంగా జరిగితే బీజేపీకి కలిసొచ్చే అంశాలు ఏంటి?

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉపఎన్నిక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ వ్యూహాలను రచిస్తోంది. మునుగోడును తమ కంచుకోటగా భావించే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య కాకుండా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్యే పోటీ జరగాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచి అధికారంలోకి వచ్చేందుకు వీలుంటుందని కమలనాథుల ఆలోచనగా తెలుస్తోంది. అంతేకాకుండా డిసెంబర్ లో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో విజయం సాధించి.. ఉప ఎన్నికకు వెళ్తే మునుగోడు ఓటర్లపై సానుకూల ప్రభావం చూపేందుకు వీలుంటుందని కమలం నేతల భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రాజీనామా చేయడం.. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వెంటనే ఆమోదించడం చకచక జరిగిపోయాయి. రాజీనామా విషయాన్ని స్వీకర్ అదే రోజు ఎన్నికల సంఘానికి తెలియజేయడంతో ఫిబ్రవరి 7, 2023లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో ఎన్నికల సందండి మొదలైంది. సర్వేల ఆధారంగా కాంగ్రెస్ ,టీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి సంకేతాలు పంపాయి. దీంతో రెండు పార్టీల్లో అసమ్మతి సెగ  రాజుకోవడంతో అధిష్టానం పెద్దలకు షాక్ తగిలింది.  

ఉప ఎన్నిక ఆలస్యమైతే నియోజకవర్గంపై మరింత పట్టుసాధించేందుకు వీలుంటుందని కమలం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇమేజ్, బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ టీఆర్ఎస్ కు సవాల్‌గా మారే అవకాశం ఉందని కమలం నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత పోరుతో సతమతమవుతున్న హస్తం పార్టీకి..ఎక్కువ కాలం ప్రచారాన్ని కొనసాగించేంత ధనబలం గానీ, అంగబలం గానీ లేనందున  త్వరలోనే చుక్కెదురవడం ఖాయమని బీజేపీ అంచనాగా తెలుస్తోంది. దీంతో పోటీ టీఆర్ఎస్ , బీజేపీ మధ్యే ఉంటుందని కాషాయం నేతల ఆలోచనగా తెలుస్తోంది.

మొత్తంమీద హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మునుగోడు లో విజయ పతాకం ఎగరవేసి ఒక్క దెబ్బకు రెండు పిట్టల సామెత మాదిరి ..వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు కాషాయం నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు.