స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ లో వర్గపోరు.. నేతలు సై అంటే సై..

స్టేషన్ ఘన్ పూర్ లో అధికార పార్టీ వర్గ పోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. స్టేషన్​ ఘన్​పూర్​ తన అడ్డా అని.. ఎవరినీ రానివ్వనంటూ రాజయ్య వ్యాఖ్యలు చేయడంతో .. నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామా అంటూ కడియం సవాల్​ విసిరారు. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే బయట తిరగలేవంటూ హెచ్చరించారు. దీంతో కడియం వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన రాజయ్య .. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే ఊరు కాదు కదా కనీసం ఇంటినుంచి బయటకు రాలేవని.. 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి నియోజకవర్గానికి ఏంచేశావో చెప్పాలంటూ డిమాండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కాగా కడియం టార్గెట్ గా రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కడియం మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా ఎన్ కౌంటర్లు జరిగాయని.. ఒక్క నియోజకవర్గంలోనే 361 మందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన దేవుడని.. స్టేషన్ ఘన్ పూర్ తాను పూజారినని.. ఇది తన అడ్డాఅని ఎవరిని రానివ్వంటూ రాజయ్య హెచ్చరికలు జారీచేశారు.

రాజయ్య వ్యాఖ్యలపై కడియం కౌంటర్ అటాక్ చేశారు. చాల సార్లు తనపై స్టేట్ మెంట్లు ఇస్తున్నారని..ఇన్నాళ్లు స్పందించలేదని.. ఇప్పుడు స్పందిచాల్సిన అవసరమెచ్చిందన్నారు కడియం. నియోజకవర్గంలో ఎవరి సత్తా ఏంటో తేల్చకుందామా అంటూ రాజయ్యకు సవాల్ విసిరాడు. రాజయ్య చిల్లర శేష్టలు మానుకోవాలని.. తన దగ్గరున్న ఆధారాలు బయటపెడితే ఊరు దాటి బయటకు రాలేవని హెచ్చరించారు. పార్టీ అధిష్టానుసారం తాను నడుచుకుంటానని .. టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే సొంత ఖర్చుతో సర్వే చేయిస్తానని .. ఎవరి సత్తా ఎంటో తెలుస్తుందని కడియం అల్టిమేటం జారీ చేశాడు.

ఇటు కడియం వ్యాఖ్యలపై రాజయ్య ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే కాకముందు కడియం ఆస్తుల ఎంత అని సూటిగా ప్రశ్నించారు.కడియంపై ఓ బుక్ కూడా రిలీజ్ అయ్యిందని.. అందులో అన్ని విషయాలు పూసగుచ్చునట్లు ఉన్నాయన్నారు. తాను సీఎం కేసీఆర్ కి వీరవిధేయుడినని తేల్చిచెప్పారు. తనదగ్గరున్న ఆధారాలు బయటపెడితే కడియం.. గ్రామం కాదు కదా కనీసం ఇంటి నుంచి బయటకు రాలేడని ఆయన హెచ్చరించారు. 14 ఏళ్లు మంత్రిగా పనిచేసిన కడియం నియోజకవర్గానికి ఏంచేశాడో చెప్పాలని రాజయ్య డిమాండ్ చేశాడు.

రాష్ట్రమంతా మునుగోడు ఉప ఎన్నిక హాడావుడి నడుస్తున్న తరుణంలో స్టేషన్ ఘన్ పూర్ అధికార పార్టీ నేతల అంతర్గత పోరు టీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇద్దరు ఒకే సామాజక వర్గానికి చెందిన నేతలు కావడంతో అధిష్టానం ఎలా స్పందిస్తుందా అని కారు పార్టీ నేతల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

Optimized by Optimole