Headlines

పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ వర్థంతి..

Nancharaiah Merugumala : (Senior Journalist) :

కేపిటలిజం రంగు, రుచి, వాసనతోపాటు పారిశ్రామిక సమాజంలో ఎలా బతకాలో తెలియజెప్పిన కారల్‌ మార్క్స్‌ 140వ వర్థంతి–ఆడమ్‌ స్మిత్‌ త్రిశత జయంతి..

ప్రపంచంలో పెట్టుబడి రంగు, రుచి, వాసన గురించి మా గొప్పగా వివరించి విశ్లేషించిన మహానుభావుడు కారల్‌ మార్క్స్‌ (1818–1883) కన్నుమూసి నేటికి 140 ఏళ్లయింది. ఈ విషయం నాకు నా పాత్రికేయ పాత కామ్రేడ్స్‌ ఎన్‌.వేణుగోపాల్, తాడి ప్రకాశ్‌ రాసిన పోస్టులు పొద్దున్నే చూశాక తెలిసింది. అలాగే ‘అర్థశాస్త్రం, పెట్టుబడిదారీ విధానం పిత’గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆడమ్‌ స్మిత్‌ (1723 జూన్‌ 5–1790 జులై 17) త్రిశత జయంతి కూడా ఈ ఏడాదే జరుపుకుంటున్నారు. పారిశ్రామిక విప్లవానికి కొన్నేళ్ల ముందు స్మిత్‌ జన్మించారు. ఇంగ్లండ్‌లోని స్కాంట్లండ్‌ లో పుట్టి అక్కడి గ్లాస్గో యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనిర్సిటీ బాలియల్‌ కాలేజీలో చదువుకున్న ఆడమ్‌ స్మిత్‌ ప్రభావం కారల్‌ మార్క్స్‌ పై కూడా ఉందని చెబుతారు. ఆడమ్‌ స్మిత్‌ మాదిరిగానే (ఆయన బతికింది 67 ఏళ్లు) మార్క్స్‌ కూడా ఏడు పదుల సంవత్సరాలు జీవించలేదు.

పెట్టుబడిదారీ విధానం అనుసరించే అన్ని దేశాలకూ వెలుగునిచ్చే దివిటీలు కారల్‌ మార్క్స్, ఆడమ్‌ స్మిత్‌. అమెరికా, ఐరోపా, ఇతర పారిశ్రామిక దేశాల్లో అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడుల లావాదేవీలు నడిపే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని కుప్పకూలినప్పుడు, ఆర్థిక ‘మందగమనం’ ఆరంభమైనప్పుడు అక్కడి ఆర్థికవేత్తలు, మేధావులు కారల్‌ మార్క్స్‌ రచనలు చదువుతారు. 20వ శతాబ్దం రెండో సగంలో మొదలైన ఈ ఆనవాయితీ 21వ శతాబ్దం మొదటి 30 ఏళ్లలో కూడా కొనసాగుతోంది. కేవలం ఆర్థిక విషయాలేగాక ఎలా పద్ధతిగా, అందరికీ మేలు జరిగేలా సమస్త ప్రజలూ జీవించాలో కేపిటలిజం ‘తండ్రి’ ఆడమ్‌ స్మిత్‌ తో పాటు, అడ్డగోలు, దారిదప్పిన పెటుబడిదారీ వ్యవస్థ పతనం కోరుకున్న కారల్‌ మార్క్స్‌ కూడా తమ రచనల్లో నొక్కి చెప్పారు. ప్రపంచంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలం ఆడమ్‌ స్మిత్, కారల్‌ మార్క్స్, ఆయన మిత్రుడు ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ (1820–1895) రచనలు, ఆలోచనలు బతికే ఉంటాయి. పెట్టుబడిదారీ విధానంపై ఆడమ్‌ స్మిత్‌ రాసిన ‘ద వెల్త్‌ ఆఫ్‌ ద నేషన్స్‌’, మార్క్స్, ఏంగెల్స్‌ రాసిన ‘ద కమ్యూనిస్ట్‌ మేనిఫెస్టో, దస్‌ కాపిటల్‌’ ఏన్ని వందలేళ్లు గడిచినా జనాన్ని ప్రభావితం చేసే పుస్తకాలు.

Optimized by Optimole