శ్రీకాళహస్తి, జూలై 12:
శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ మాజీ డ్రైవర్ హత్య
కేసు కలకలం రేపుతోంది. స్థానిక జనసేన పార్టీ ఇన్చార్జ్ వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబు ప్రధాన నిందితులుగా ఉన్న ఈ కేసులో, గత డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాసుల రాయుడు దారుణ హత్యకు గురయ్యాడు.పోలీసుల కథనం ప్రకారం, రాయుడిని చిత్రహింసలకు గురిచేసిన అనంతరం, హత్య చేసి చెన్నై సమీపంలోని కూవం నదిలో శవాన్ని పడేశారన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. నదిలో లభించిన మృతదేహాన్ని సైంటిఫిక్ ఆధారాలతో గుర్తించిన పోలీసులు, బాధితుడు శ్రీనివాసుల రాయుడేనని నిర్ధారించారు.
బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు కొంతకాలంగా వినూత కోటా దగ్గర నమ్మిన సహాయకుడిగా, డ్రైవర్గా సేవలు అందించేవాడు. అయితే జూన్ 21న, అతను చేసిన ద్రోహానికి సంబంధించిన వివరణతో వినూత కోటా సోషల్ మీడియా వేదికగా అతనిని విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించారు. “ఈ వెంటనే శ్రీనివాసులుతో మాకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
జూలై 8న రాయుడిని హత్య చేసి నదిలో పడేశారనే పక్కా ఆధారాలతో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. విచారణలో వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబుతో పాటు, శివకుమార్, దాసర్, గోపి అనే నలుగురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, శ్రీవేంకటేశ్వర ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.