Morsing: ఈ కళాకారిణి కథ ఎందరికో ఆదర్శం..

Morsingartist: మోర్సింగ్(Morsing).. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఓ సంగీతం వాయిద్యం ఇది. వాయిద్యాల్లో అతి చిన్నగా కనిపించేది కూడా ఇదే. శబ్దం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఝుమ్మని వినిపిస్తుంది. ఇదీ అని చెప్తే గుర్తుపట్టడం కొంచెం కష్టమే కానీ, వాయిద్యకారులు దాన్ని వాయిస్తుంటే మాత్రం మీరు గుర్తుపడతారు.

భారతదేశంలో ప్రసిద్ధి పొందిన ఈ వాయిద్యం గురించి మాట్లాడుకోవాలంటే చాలామంది ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భాగ్యలక్ష్మి మురళీకృష్ణ గురించి చెప్పుకోవాలి. దేశంలోని అతి తక్కువమంది మహిళా మోర్సింగ్ వాయిద్యకారుల్లో ఆమె ఒకరు. కర్ణాటక రాష్ట్రంలో ఆమే తొలి మోర్సింగ్ వాయిద్యకారిణి.

అసలు ఏమిటీ మోర్సింగ్ ప్రత్యేకత? దీన్ని పెదాల మధ్య పెట్టుకుని వాయిస్తారు. దీనికి చిన్నబ్లేడు కూడా ఉంటుంది. చేతివేళ్లతో దాన్ని లయబద్ధంగా తడుతూ ఉంటే శబ్దం వస్తుంది. మోర్సింగ్ మన దేశంలో పుట్టిన వాయిద్యం కాదు. 1500 ఏళ్ల క్రితం ఇటలీలో దీని మూలాలు ఉన్నాయని అంటారు. మనదేశంలో రాజస్థాన్, అస్సామ్, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని వాయిస్తుంటారు. మోర్సింగ్ వాయించే సమయంలో కళాకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం పట్టు తప్పినా నాలిక కోసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇది వాయించడానికి చాలా పట్టు కావాలి. దీంతోపాటు సంగీతం తెలిసి ఉండాలి. అప్పుడే పాటకు లేదా రాగానికి తగ్గట్లు స్వరస్థానాలు వాయించడం వీలవుతుంది.

భాగ్యలక్ష్మి తండ్రి భీమాచార్ కూడా ప్రసిద్ధి పొందిన మోర్సింగ్ విద్వాంసుడు. దక్షిణాదిలో మోర్సింగ్‌ని పాపులర్ చేసిన వ్యక్తి. దాన్ని వాయించడంలో అత్యంత నిపుణత పొందిన వ్యక్తి. విచిత్రమేమిటంటే, ఆయన తన ఇద్దరు కొడుకులకూ మోర్సింగ్ వాయించడం నేర్పించారు. ఆ రోజుల్లో ఆలిండియా రేడియా మహిళా వాయిద్యకారులతో ఓ బృందాన్ని తయారుచేసింది. అందులో మోర్సింగ్ వాయించే మహిళ లేరు. మొత్తం రాష్ట్రమంతా వెతికినా ఎవరూ దొరకలేదు. ఆ సమయంలో వాళ్లు భీమాచార్ దగ్గరికొచ్చి ‘మీ అమ్మాయికి మోర్సింగ్ నేర్పిస్తే మా బృందంలో చేర్చుకుంటాం’ అన్నారు. ఆ సమయంలో భాగ్యలక్ష్మికి పదేళ్లు. వెంటనే ఆయన ఆమెకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. నెలల వ్యవధిలోనే ఆమె మోర్సింగ్‌లో నిపుణత సాధించారు. అలా రాష్ట్రంలో ఆమె తొలి మోర్సింగ్ కళాకారిణిగా మారారు.

మోర్సింగ్‌ని విడిగా ప్రదర్శించినా వినేందుకు బాగుంటుంది. అయితే ఎక్కువగా ఇది పక్కవాయిద్యంగానే మిగిలింది. అంటే గాయకుడు పాడుతూ ఉంటే, చుట్టూ ఉండే మృదంగం, వయోలిన్‌, వేణువులతోపాటు మోర్సింగ్ కూడా సహకరిస్తుంది. భాగ్యలక్ష్మి మోర్సింగ్‌తో అద్భుతాలు సాధించారు. దానికంటూ గుర్తింపు తెచ్చారు. వెయ్యికిపైగా కచేరీల్లో మోర్సింగ్ వాయించారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.ఎస్.షీలా, నీలా రామ్‌గోపాల్ వంటి అనేకమంది కచేరీల్లో ఆమె మోర్సింగ్ ప్రదర్శించారు. ఎంతోమంది కళాకారులతో కలిసి జుగల్బందీలు నిర్వహించారు. ‘కర్ణాటక కళాశ్రీ’, ‘గానకళా భూషణ’ అవార్డులు అందుకున్నారు. ఆమె తండ్రి, అన్నలతోపాటు ఆమె కొడుకు, అల్లుళ్లు అందరూ మోర్సింగ్ వాయిస్తాడు. ఆమస్టర్‌డ్యామ్‌లో జరిగిన ‘World Jewish Harp Festival’కి భారతదేశం తరఫున ఆమె, ఆమె తండ్రి, ఆమె కుమారుడు కలిసి వెళ్లి, ప్రదర్శన ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కళాకారులు అక్కడ ప్రదర్శించడం ఘనతగా మారింది.

‘రెండు గంటల కచేరీలో వేదిక ఉన్న వాయిద్యాలకు విడివిడిగా 20 నిమిషాలకు మించి సమయం రాదు. ఆ కాస్త సమయంలోనే మనం మన ప్రతిభ చూపాలి. మనం వాయించేది ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేయాలి. మోర్సింగ్ నాకు ఆ అవకాశం ఇచ్చింది’ అంటారు భాగ్యలక్ష్మి. ‘తయారు చేసే అన్ని మోర్సింగ్ వాయిద్యాలూ కళాకారులకు పనికొస్తాయని చెప్పలేం. అవి వారికి సరిపోయి, వారి నోటికి కుదురుకున్నాకే ప్రదర్శన సాధ్యమవుతుంది. ఆ లెక్కన వారొక వంద మోర్సింగ్‌లను పరీక్షించి, అందులో ఒకటో, రెండో ఎంచుకోవాల్సి ఉంటుంది’ అంటారామె.

Optimized by Optimole