ముక్కోటి ఏకాదశి విశిష్టత..!

డాక్టర్ కావూరి రాజేశ్ పటేల్ :   ధనూరాశిలో సూర్యుడు సంచరించే మాసం- ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ముక్కోటి దేవతలైన బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర గణాలు అసురశక్తులపై విజయాన్ని సాధించడానికి శ్రీహరి అనుగ్రహాన్ని ఆకాంక్షించాయి. శ్రీహరి దర్శనాన్ని పొంది, విష్ణు కరుణకు పాత్రులయ్యాయి. సకల దేవతలూ వైకుంఠ నారాయణుడి దర్శనం పొందిన ఆ మహత్తర సందర్భమే- ముక్కోటి ఏకాదశి. ధనుస్సంక్రమణం నుంచి మకర సంక్రమణం వరకు ఉండే ‘మార్గళి’ మాసం మధ్య ముక్కోటి వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి ముందు ముక్కోటి దేవతలతో కూడి ఉన్న మధుసూదనుడిని ముక్కోటి ఏకాదశినాడు. ఉత్తర ద్వారం గుండా ఆలయాల్లో దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని విశ్వాసం. ముక్కోటి ఏకాదశికి ‘మహాహరివాసరం’ అని పేరు. విశ్వమంతా వ్యాపించిన విష్ణుశక్తిని ఆవాహన చేసుకుని, ప్రతికూల శక్తుల్ని నిలువరించడానికి ఈ పర్వం విశేషమైనదని పద్మపురాణం అభివర్ణించింది అందుకే ఈ తిథిని భగవదవలోకన దినోత్సవంగా పరిగణిస్తారు.

మురాసురుడిని విష్ణువు వధించి, ఆ సందర్భంలో ఏకాదశి తిథిని సృజించాడని భవిష్యోత్తర పురాణ కధనం. మురుడు అజ్ఞానానికి, అవివేకానికి సంకేతం. మురారి దివ్య జ్ఞానానికి ప్రతిఫలనం. జ్ఞానం వల్ల అజ్ఞానం తొలగుతుంది. తద్వారా ఏకోన్ముఖమైన చైతన్యం వెల్లివిరుస్తుంది. ఆ ఏకోన్ముఖ చైతన్యమే- ఏకాదశి! వైకుంఠంలో ఉండే తివిక్రముడు శుద్ధ జ్ఞానమూర్తి. వైకుంఠం అంటే జ్ఞానసాగరమని ఆదిశంకరులు అభివర్ణించారు. వైకుంఠమనే శబ్దం ఎన్నో విశేషార్ధాల మేలుకలయిక. ‘కుంఠనం’ అంటే వియోగం. వికుంఠ అంటే- కలిపి ఉంచడం. అనంత ప్రాకృతిక శక్తితో జీవుల్ని సదా సమ్మిళితం చేసే పరమాత్మనే ‘వికుంఠుడు’ అంటారు. జీవశక్తిని ప్రాణశక్తితో కలిపి ఉంచుతూ, సర్వదా ఆ శక్తిని జాగృతపరచే మహావిరాట్ స్వరూపుడు- విష్ణుభగవానుడు.

పంచభూతాల పంచీకరణాదుల్ని తానే స్వయంగా నిర్వహిస్తున్నానని, అందుకే తనను వైకుంఠుడుగా వ్యవహరిస్తారని మహాభారతంలో శాంతిపర్వంలో కృష్ణ భగవానుడు వెల్లడించాడు. ముక్కోటి అంటే అనేకత్వం, భిన్నత్వం… అలా, భిన్నత్వంలో ఉండే సృష్టిలోని జీవరాశికి ఏకత్వ భావాన్ని ప్రబోధించే శుభసందర్భమే- ముక్కోటి ఏకాదశి. వైకుంఠంలో నిత్యనివాసం ఉండే విష్ణువు అనే పరమాత్మను దర్శించడానికి సప్తద్వారాల్ని అధిగమించాలి. ఆదిత్యుడు, అగ్ని, వాయువు, ఇంద్రుడు, జయ విజయులు, భద్ర సుభద్రులు, దాత విధాతలు- ఈ సప్త ద్వారాలకు సంరక్షకులుగా ఉంటారు. సప్త ఆవరణలతో, సప్త ప్రాకారాలతో, సప్త ద్వారయుతమైన వైకుంఠంలోకి అడుగిడటమే మోక్షస్థితి. ఆ అత్యున్నత స్థితిని సాధించడానికి సాధకులు చేసే ప్రయత్నాన్ని యోగశాస్త్రం ముక్కోటిమార్గంగా వివరించింది.

నవద్వారాలున్న ప్రతి మనిషిలో సర్వోత్కృష్టమైన స్థానం- శిరస్సు శరీరంలో ఉత్తర భాగానికి అగ్రభాగం- శిరస్సు నడుము కింది భాగం దక్షిణ భాగం. ఉత్తర భాగానికి శీర్ష స్థానమైన శిరస్సులో ఉన్న మనోమందిరంలో దైవాన్ని దర్శించడమే- ఉత్తర ద్వార దర్శనం. మనోసంకల్పాలు, హృదయానుగత భావపరంపరలు, అంతఃకరణాల్లోని ఉత్తమ గుణాల్ని నిరంతరం పరంధాముడితో మమేకం చేయడమే విష్ణు ఆరాధనం.

“మనోవాక్కాయ కర్మల్ని సర్వాత్మణా శ్రీహరితో సమ్మిళితం చేసి, విశ్వవిరాట్ వైభవాన్ని విష్ణురూపంగా దర్శించడమే ముక్కోటి ఏకాదశి పరమార్ధం”