Hyderabad:
సమాచార హక్కు చట్టం – 2005 రూపుదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సామాజిక కార్యకర్తల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అయితే వీరి గురించి చాలా మందికి తెలియకపోవడం విచారకరం. దేశ ప్రజలకు పారదర్శక పరిపాలనను అందించిన చట్టం వెనుక ఉన్న ఈ ముగ్గురి కృషి విశేషమైనది. పై ఫోటోలో కనిపిస్తున్న. ముగ్గురిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి అరుణా రాయ్ (IAS). ప్రభుత్వ సేవలో ఉండగానే పేదల కోసం పనిచేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, అణగారిన వర్గాల తరఫున తన గొంతు వినిపించారు. ఎడమవైపున ఉన్న శంకర్ సింగ్ సామాజిక కార్యకర్తగా పల్లె ప్రజలకు న్యాయం దక్కేలా పోరాటం చేశారు. కుడివైపున ఉన్న నిఖిల్ డే, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినా, గ్రామీణ భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చి ఉద్యమంలో భాగమయ్యారు.
1987 మే 1న రాజస్థాన్‌లోని దేవదుంగ్రి గ్రామంలో ఈ ముగ్గురు కలిసి “మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్” (MKSS) అనే సంస్థను ప్రారంభించారు. ప్రభుత్వంలో పారదర్శకత, బాధ్యతను తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ ఉద్యమం అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఈ పోరాటం ఫలితంగానే సమాచార హక్కు చట్టం – 2005 అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి అయ్యింది . ఈ సందర్భంగా చట్టం కోసం కృషి చేసిన ఆ ముగ్గురు మహనీయులు చరిత్రలో నిలిచిపోతారు.