“వాస్తవానికి ఒక ఆర్టికల్ చదివితే వచ్చే నాలెడ్జ్ ఎన్నో పేపర్లతో సమానం_సగం సగం చదివి దేశ, రాష్ట్ర రాజకీయాలతో పాటు ప్రజల మీద ఎనాలసిస్ చేయడం అనేది మూర్ఖత్వం “
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు .. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత అందెశ్రీ ఎంత వాస్తవిక ధోరణితో ఈ పాట రాశారో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే అర్థం అవుతోంది. సమాజంలో ప్రస్తుతం బంధాలు, బంధుత్వాల పాతర కొనసాగుతుంది. డబ్బు కోసం, పలుకుబడి కోసం కట్టుకున్న వారిని, కడుపున పుట్టిన వారిని, నమ్మిన వారిని నట్టేట ముంచే పద్దతి దిగ్విజయంగా కొనసాగుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉండేవి. గుంపెడు మందితో అందరు కలిసి మెలిసి ఉండేవాళ్లు. ఏదైనా సమస్య వచ్చినా, అందరం కూర్చొని మాట్లాడుకునే వారు. సర్ది చెప్పుకునే వారు. కానీ, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు నెమ్మదిగా విచ్ఛిన్నం అవుతున్నాయని అని చెప్పుకోవడం కంటే ‘అయ్యాయి’ అని చెప్పుకోవడం మంచిదనిపిస్తుంది.మనుషులలో అహంకారాలు పెరిగాక, ఉమ్మడి కుటుంబాలు విస్పోటనం చెందుతున్నాయి. కలిసి ఉండటం కంటే విడిపోవడం మంచిదనే పద్దతి పెరుగుతుంది.ఒక చోట కలిసి పెరిగాం,ఒకే చోట చదివాం,ఒకే ఊరి వాళ్లం అనే మాటలు కూడా పనికిరావడం లేదు. వయసు పెరిగినా కొద్ది ఆలోచనలు పెద్దవి అవుతున్నాయి,డబ్బు మినహా, మిగతా అంశాలన్నీ దూరం అవుతున్నాయి.
రోజు రోజుకు మనిషిలో పెరుగుతున్న స్వార్థం మంచితనాన్ని దూరం చేస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటలు నేడు కలిసి కలహించుకోవడం కన్నా, విడిపోయి సంతోషంగా ఉండటం మేలు అనుకునే పరిస్థితి వచ్చింది. గతంతో పోల్చితే ఇప్పుడు కుటుంబాల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. వెన్నెల రాత్రుల్లో చందమామ కనిపిస్తున్నా, చందమామ కథలు చెప్పే వారు లేకుండా పోయారు.ఎండాకాలం యథావిధిగా ఉన్నా, వేసవి సెలవుల్లో అందరు కలిసి సంతోష లు,బాధలు పంచుకునే పరిస్థితి లేకుండా పోయింది.ప్రతి ఏటా పండగలు వస్తున్నా, ఏ పండగకు ఏ వంటలో చేయాలో తెలియని స్థితి ఉంది. ఇప్పటి తరాలకు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు అవసరం లేకుండా పోయింది. స్మార్ట్ ఫోన్లు,ఇంటర్నెట్, రెస్టారెంట్లు, అందుబాటులోకి వచ్చాయి. కావాల్సింది తెలుసుకోవొచ్చు. అనుకున్నది తెప్పించుకుని తినొచ్చు. కానీ, ఆప్యాయతలు రావనే విషయం మాత్రం గమనించలేకపోతున్నారు.
ఇప్పటి చదువులు సైతం ఉద్యోగాలు చేయడానికి పనికొస్తాయేమో కానీ, జీవితానికి కావాల్సి విలువలు, సాంప్రదాయాలు, ప్రేమాభిమానాలు మాత్రం నేర్పించలేకపోతున్నాయి. ఇప్పటి బంధాలన్నీ ఆర్థిక బంధాలుగానే మిగిలిపోతున్నాయి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే మనిషి అన్ని బంధాలు వ్యాపార బంధాలుగానే మారిపోతున్నాయి.డబ్బుతో ముడిపడిన బంధాలతో పోల్చితే, ఇచ్చిపుచ్చుకునే పద్దతి పాటించే బంధాలే గట్టివి. కానీ, ఇప్పుడు ఆర్థిక సంబంధాలే తప్ప,అన్యోన్యమైన సంబంధాలకు చోటులేకుండా పోతుంది. ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ రోజులు నిలబడలేకపోతున్నాయి. డబ్బుకి ప్రాధాన్యత ఉన్న చోట ప్రేమ అనేది నిలబడదని తేలిపోతుంది. డబ్బుతో అన్ని పనులు చేసుకోవచ్చని కొంత మంది భావించవచ్చు. కానీ, డబ్బుతో కొనలేని బంధాలు కూడా కొన్ని ఉంటాయని గుర్తుంచుకోవాలి.
అమ్మను మించిన దైవమున్నదా? అంటారు.. కానీ, అదే తల్లి తన వివాహేతర సంబంధానికి అడ్డు తగులుతున్నారని భర్తను చంపిన సందర్భాలున్నాయి. కనిపెంచిన పిల్లను చంపిన ధాఖాలున్నాయి. కుటుంబానికి పెద్దగా ఉంటూ కుటుంబ సంరక్షణగా ఉండాల్సిన తండ్రి ఇప్పుడు అదే వివాహేతర సంబంధంతో కట్టుకున్న భార్యను, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలను చంపి పాతరేసిన ఘటనలూ చూస్తున్నాం. ఆస్తి కోసం తండ్రిని చంపిన కొడుకులను చూస్తున్నాం. రైతు బీమా కోసం తల్లిని చంపిన మూర్ఖులు కళ్లముందే కనిపిస్తున్నారు. రాజకీయాల కోసం సొంత మనుషులనే చంపుకున్న పరిస్థితులు దాపురించాయి. వివాహేతర సంబంధంతో భర్తను చంపి, అదే భర్త స్థానంలో ప్రియుడిని తీసుకొచ్చి ఆస్పత్రి బెడ్ మీద పడుకోబెట్టిన దుర్మార్గపు తల్లులు ఈ సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు. డబ్బుంటే చాలోయ్, కొండమీది కోతినైనా తీసుకొచ్చుకోవచ్చు అనే ధోరణి ఎంతోకాలం నిలబడదనే విషయం గుర్తుంచుకోవడం మంచిది.డేరాబాబాలాంటి వ్యక్తులు ఇంధుకు సరైన ఉదాహరణ.ఒకటి మాత్రం వాస్తవం బంధాలు బంధుత్వాలపై అవగాహన లేని వాళ్ళు భవిష్యత్తు తరాలకు సరైన మార్గ నిర్థేశనం చేయలేరనేది చారిత్రక వాస్తవం..
_ఎప్పటికైనా ప్రేమ, నమ్మకం అనే పునాదుల మీదే ఈ సమాజం నిలబడుతుందని మర్చిపోకూడదు.
“అవినీతి జరగవచ్చు అక్రమాలు జరగవచ్చు జనాలకు మాత్రం అవేవీ పట్టవు … డబ్బు పిచ్చితో అన్యాయాలను వాస్తవాలుగా, వాస్తవాలను అన్యాయాలుగా మన నోటితోనే పలుకుతూ భవిష్యత్ తరాలకు బతుకుతెరువు చూపిస్తున్నాం తప్ప బతుకులో నిజాయితీని చూపించలేకపోతున్నాం అనే ఆవేదన నన్ను కలిసి వేస్తుంది”
≠=================
_శేఖర్ కంభంపాటి, నల్లగొండ జర్నలిస్ట్