ఉగాది సంవత్సరాల నామాలు – వివరణ
ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2021 ఉగాది ప్లవ నామ సంవత్సరంగా పిలువబడుతుంది.
1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోద్యూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భావ, 9.యువ, 10.ధాత, 11.ఈశ్వర, 12.బహుధాన్య, 13.ప్రమాధి, 14.విక్రమ, 15.వృష, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ , 19.పార్థివ, 20.వ్యయ, 21.సర్వజిత, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, 30.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, 33.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృత, 37.శోభకృత, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృత, 46.పరిధావి, 47.ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నల, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్థ, 54.రౌద్రి, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58.రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ఉగాది పచ్చడి విశిష్టత:
“ఉగాది”నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో మధురం(తీపి), ఆమ్లం(పులుపు), కటు(కారం), కషాయ(వగరు), లవణం(ఉప్పు), తిక్త(చేదు) రుచులు మిళితమై ఉంటాయి.
ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే సంతోషం(తీపి), దుఃఖం(చేదు), కోపం(కారం), భయం(ఉప్పు), విసుగు(చింతపండు), ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం. అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.
కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.
చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
పచ్చి మిరపకాయలు శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది.
మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.
వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.
ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం
ఒకటిన్నర కప్పు నీరు.
రెండు టేబుల్ స్పూన్ల మామిడి తరుగు.
కొద్దిపాటి వేప పువ్వులు.
మూడు టేబుల్ స్పూన్ల బెల్లం.
తగినంత ఉప్పు.
రెండు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు
ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం.
పంచాంగ శ్రవణం :
ఈ రోజు యుక్త వయస్కులు, నడివయస్కులు, వృద్ధులు, రాజకీయ నాయకులు, వృత్తి నిపుణులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రైతులు ఎంతో శ్రద్ధగా వారి వారి స్థాయిల్లో పంచాంగ శ్రవణం చేయటం పరిపాటి. వారి రాశి ఫలాలను నూతన సంవత్సరాదిన ఎలా ఉండబోతుందో మిక్కిలి ఆశక్తితో జ్యోతిష్య పండితులు చేసే పంచాంగ పఠనాన్ని ఎంతో జాగ్రత్తగా ఆశక్తితో వింటారు.