Nancharaiah merugumala senior journalist:
” దేవదాసీ కుల, కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్..యూపీ, బిహారీల శారీరక శ్రమను కించపరస్తూ మాట్లాడడం దేనికి సంకేతం?”
ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన ఇంగ్లిష్ రాని కార్మికులు తమిళనాడులో టాయిలెట్లు కడుగుగున్నారని డీఎంకే లోక్ సభ సభ్యుడు దయానిధి మారన్ గతంలో చేసిన వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర నిరసనకు కారణమైంది. డీఎంకే నాయకుడు ఎం. కరుణానిధి మేనల్లుడి (అక్క కుమారుడు మురసోలి మారన్) కొడుకైన కేంద్ర మాజీ మంత్రి దయానిధి ఇలా మాట్లాడడం దేశంలో ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో సంచలనంగా మారంది. కరుణానిధి, ఆయన అక్క షణ్ముగసుందరి దేవాలయాలతో, ఆలయ కళలతో ముడిపడిన దేవదాసీ కుటుంబంలో పుట్టారు. దేవదాసీలకు మానసిక లేదా మేధోపరమైన శ్రమతోపాటు శారీరక కష్టం అంటే ఎంతో విలువ, గౌరవం. మరి ఈ లెక్కన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ప్రగతి సాధించిన దేవదాసీ కుటుంబ నేపథ్యం ఉన్న దయానిధి మారన్ పైన చెప్పినట్టు తూర్పు యూపీ, బిహారీ శ్రామికుల కష్టాన్ని కించపరుస్తూ మాట్లాడడం ఎంతో బాధాకరం. ఏ వృత్తిలో ఉన్నా మనుషులందరికీ సమాన గౌరవం ఇవ్వాలనేది ఈవీ రామసామి ఉరఫ్ పెరియార్ ప్రగాఢ విశ్వాసం. పెరియార్ సిద్ధాంతాలతో అనుబంధం ఉన్న డీఎంకే ఎంపీ దయానిధి– టాయిలెట్లు కడగడాన్ని తక్కువ చేసి చెప్పడం దక్షిణాది ద్రావిడ భావజాలంలోని లోపాన్ని బట్టబయలు చేస్తోంది.