Nancharaiah merugumala senior journalist:
‘ ఇప్పుడు ఆంధ్రా కాపులకు కావాల్సింది నితీశ్ కుమార్ వంటి నిజాయితీ, పదునైన మెదడు, రాజకీయ వివేకమున్న నాయకుడు కాదా?’
బీజేపీ మొదటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వాల్లో (1998–2004 మధ్య) కీలక కేబినెట్ మంత్రులుగా కొనసాగిన లోహియా సోషలిస్టులు జార్జి ఫెర్నాండెజ్, నితీశ్ కుమార్ (సమతా లేదా జేడీయూ) ఆ లేత కాషాయ రంగు సర్కారు మితిమీరిన మతతత్వ పంథా అనుసరించకుండా నియంత్రించగలిగారు. ఇప్పుడు తొలి ఓబీసీ బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ గద్దెపై కూర్చుని పదేళ్లు పూర్తిచేసుకుని మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో– బిహారీ ఓబీసీ సోషలిస్టు నేత నితీశ్ రాష్ట్రంలో బీజేపీతో ఏడోసారి జట్టుకట్టడం భారతదేశంలో లౌకికవాదం పల్చనవడానికి దోహదం చేసే పరిణామం కాదు. దాదాపు 13 కోట్ల జనాభా ఉన్న బిహార్ లో కేవలం 2.87 శాతమున్న కుర్మీ అనే వ్యవసాయాధారిత కులంలో పుట్టిన నితీశ్ ఎన్నిసార్లు ‘రాజకీయ పల్టీలు’ కొట్టినా ఇంత వరకు ఆయన కుర్తా. పాయిజామాలపై ఎలాంటి మరక పడలేదు. ఉత్తర్ ప్రదేశ్ లో సైతం కుర్మీ కులస్తులు అక్కడి జనాభాలో మూడున్నర శాతం లోపే అయినా వారి కన్నా నాలుగు రెట్లు ఎక్కువ జనాభా ఉన్న యాదవుల కన్నా ఎక్కువ మంది ఈ వర్గం నేతలు అసెంబ్లీకి 2022లో ఎన్నికయ్యారు. బిహార్ కుర్మీల కన్నా రెట్టింపు శాతం జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరులు రాబోయే శాసనసభ ఎన్నికల్లోనే రాజ్యాధికారం వస్తుందనే భ్రమల నుంచి బయటపడి–తమ కులం నుంచి నితీశ్ కుమార్ వంటి వివేకం, రాజకీయ నేర్పు, నిజాయితీ ఉన్న నేత అవతరించే పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేయాలి. అప్పుడు సకలాంధ్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుంది. కేవలం జనాభా ఉన్నతం మాత్రాన గొప్ప నాయకులు పుట్టరనే సూత్రం కాపులు సహా అన్ని కులాలకూ వర్తిస్తుందేమో!