కాపులు ఎవరు? వారి జనసంఖ్య ఎంత? ‘రాజ్యాధికారం’ ఎప్పుడొస్తుంది?

Nancharaiah merugumala:(senior journalist)
కాపులు ఎవరు? కాపు, బలిజ, తెలగ, ఒంటరి (కేబీటీఓ) సముదాయం జనం ఎంత మంది? కాపులకు ఇప్పుడు అసలు ‘రాజ్యాధికారమే’ లేదా? కాపు సంస్కృతి అనేది ఉందా? ఈ విషయాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (USA) చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) లేదా మసాచూసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణులతో అధ్యయనం చేయిస్తే బావుంటుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఎవరైనా ఈ సలహా ఇస్తే బావుంటుంది. ఎందుకంటే దళితులు ఎవరు? శూద్రుల ఎవరు? అని బాబాసాహబ్‌ భీంరావ్‌ ఆర్‌ అంబేడ్కర్‌ గారు పరిశోధన చేసి రెండు పుస్తకాలు రాశారు. ఇప్పుడు అలాంటి పుస్తకాలు రాసే భారత మేధావులు ఎవరూ లేరు. 1983 జనవరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో మొదటిసారి కమ్మ కులంలో పుట్టిన నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ లెక్కన కాపు సముదాయం (కేబీటీఓ)లో పుట్టిన తెలుగు రాజకీయ నేత అర్జెంటుగా అవశేషాంధ్ర ప్రదేశ్‌ సీఎం అవ్వాల్సిన అత్యవసర పరిస్థితి తలెత్తిందా? తూర్పు గోదావరి కాపు కుటుంబంలో పుట్టిన ఘనమైన పూర్వపు జస్టిస్‌ పార్టీ నేత కూర్మి వేంకట రెడ్డి నాయుడు 1934లో బ్రిటిష్‌ వారి పాలనలో మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా మూడున్నర నెలలు, 1936లో మద్రాసు గవర్నర్‌ గా మూడున్నర నెలలు పనిచేశారు. అలాగే ఇదే జస్టిస్‌ పార్టీ తరఫున మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చిత్తూరు కమ్మ కుటుంబంలో పుట్టిన బొల్లిన (బొల్లినేని?) మునుస్వామి నాయుడు 1930–1932 మధ్య రెండేళ్లు అధికారంలో ఉన్నారు. ఇలా ఒక కులం నుంచి ఎవరైనా నేత కొన్నాళ్లు ముఖ్యమంత్రి కావడం పెద్ద విశేషమేమీ కాదని ఈ ఇద్దరు నేతల జీవితాలు చదివితే అర్ధమౌతుంది. అలాగే, ఉమ్మడి ఏపీ కాంగ్రెస్‌ శాసనసభా పక్షంలో ఒక రెడ్డి నేతను లేదా క్షత్రియ నేతను సీఎంగా చేయడంలో ఏకాభిప్రాయం కుదరక 1960లో (అనుసూచిత కులమైన (ఎస్సీలు) మాల కుటుంబంలో పుట్టిన) దివంగత దామోదరం సంజీవయ్య గారికి ముఖ్యమంత్రి పదవి చేతికందింది. అంతమాత్రాన అప్పుడు మాలలకు ‘రాజ్యాధికారం’ వచ్చిందని దళిత నేతలు ఎవరూ అనుకోలేరు. ఈ విషయంలో మాల సామాజికవర్గం నుంచి ప్రస్తుత కాపు నేతలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కాపు సముదాయంలో పుట్టిన నాయకుడు లేదా నాయకురాలు ముఖ్యమంత్రి అయితేనే కా–బ–తె–ఒం కులాలకు ‘రాజ్యాధికారం’ వస్తుందనుకునే నమ్మకంతో ఉన్నారు కాపులు. తెలుగు టీవీ న్యూజ్‌ చానల్స్‌ లో మాట్లాడే కాపు మేధావులు, కాపు రాజకీయ నేతల మాటలను బట్టి ఈ విషయం అర్ధమౌతోంది.
కాపు జనాభాను బట్టే సీఎం పదవి లేదా రాజ్యాధికారం కావాలనే డిమాండ్‌!
………………………………………………………………………………….
కమ్మ యాజమాన్యంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా అనేక తెలుగు దినపత్రికలు– ‘ కాపులతో ఎందుకొచ్చిన గొడవ?’ అనే లౌక్యంతో ఏపీలో కాపు సముదాయం జనాభా పాతిక శాతం వరకూ ఉందని రాస్తాయి. టీవీ 9, ఎన్‌ టీవీ న్యూస్‌ వంటి ప్రధాన న్యూజ్ చానల్స్‌ సైతం తెలుగు జనాభాలో నాలుగో వంతు నిఖార్సయిన కాపులేనని చెబుతుంటాయి. టీవీ 9లో ఈరోజు చర్చలో కూడా వి. రజనీకాంత్‌ కూడా ఎంతో తెలివిగా ‘కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, వాటి అనుబంధ కులాల జనాభా 28 శాతానికి పైగా ఉందని ఈ కుల నేతలు చెప్పుకుంటున్నారు,’ అని ప్రకటించారు. అనేక స్వతంత్ర సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలేమో ఏపీలో కాపుల జనాభా 7 శాతం లోపేనని ‘బల్లగుద్ది’ మరీ చెబుతున్నారు. భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్‌ దేశాలు మళ్లీ ఒక దేశం కావడం సాధ్యం కావచ్చేమో గాని తెలుగునాట కోటా లేని ఓసీ కాపుల జనాభా లెక్క ఎన్నటికీ తేలదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో…ఈ విషయాలపై అమెరికాలోని కొలంబియా, హార్వర్డ్‌ లేదా యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (యూసీఎల్యే) వర్సిటీల పరిశోధకులు రీసెర్స్‌ చేస్తే మేలేమో! అలా జరిగిన తర్వాత రాయలసీమ బలిజలు, కోస్తా జిల్లాల కాపుల మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మొన్నటి దాకా ఏపీలో కాపుల అంబేడ్కర్‌ గా దివంగత సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి గారికి పేరుండేది. నిన్న విశాఖలో వంగవీటి మోహనరంగారావు గారి 34వ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో బీజేపీ తెలుగు నియోగ బ్రాహ్మణ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు గారి ప్రసంగం విన్నాక తాజాగా ‘కాపుల అంబేడ్కర్‌’ అనే బిరుదు ఆయనకు ఇవ్వడం అన్ని విధాలా ఉచితమనిపిస్తోంది. ‘ఒక్కసారి కాపు ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయితే, కాపులను ఏ శక్తీ ఆ పదవి నుంచి దింపడం కష్టమే,’ అని నరసింహారావు అన్న మాటలు భవిష్యత్తును సూచించేవిగా కొందరికి కనపిస్తున్నాయి. వినిపించాయి.

You May Have Missed

Optimized by Optimole