pottisriramulu: పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు?

Nancharaiah merugumala senior journalist:

పొట్టి శ్రీరాములు మృతికి కారకులెవరు? ఆ ‘పాపమే’ ఉమ్మడి ఏపీని 62 ఏళ్లకు చంపేసిందా?

దేశ రాజధాని ఢిల్లీలో పొరుగు రాష్ట్రం రాజస్థాన్‌కు చెందిన తోటి వైశ్య ప్రముఖులు బిర్లాలు నిర్మించిన భవన ప్రాంగణంలో జాతిపిత మోహన్‌దాస్‌ కే గాంధీని 1948 జనవరి 30న హిందూ మతోన్మాదులే హత్యచేశారనేది మెజారిటీ భారతీయుల నమ్మకం..అప్పటికి ఐదేళ్ల తర్వాత దక్షిణాది మహానగరం మద్రాసులో కాంగ్రెస్‌ బ్రాహ్మణ నేత బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆత్మత్యాగానికి సిద్ధమై నిరశన దీక్షలో కూర్చున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అకాల మరణానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పేరుతో రాజకీయ ప్రయోజనం ఆశించిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి కాంగ్రెస్‌ బడా నేతలే కారణమని నమ్మేవారు ఇప్పటికీ తెలుగునాట చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు, ‘‘పుట్టుకతో వైశ్యుడిగా జన్మించిన సంఘ సంస్కర్త అమరజీవి శ్రీరాములు గారి ప్రాణాలు పోవడానికి కారణం తమిళ శ్రీవైష్ణవ అయ్యంగార్‌ బ్రాహ్మణుడిగా మాత్రమే తెలుగువారు చూసిన నాటి మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి గారి మంకు పట్టుదల లేదా స్వార్ధం కాదు.

తెలుగు నియోగి టంగుటూరి ప్రకాశం నాయకత్వంలోని కోస్తా, రాయలసీమ నేతల వ్యూహమే శ్రీరాములు గారి విషాదకర మరణానికి దారితీసింది,’’ అనే విషయం లేదా అభిప్రాయంపై ఆంధ్రప్రదేశ్‌ జనం ఇంకెప్పుడు బాహాటంగా మాట్లాడుకుంటారో?

శ్రీరాములు గారి 1952 డిసెంబర్‌ 15 ఆత్మత్యాగంతో 1953 అక్టోబర్‌ ఒకటిన పుట్టిన ఆంధ్రరాష్ట్రం మూడేళ్లకే (1956 నవబంబర్‌ 1న) మాయమై, ఆ తర్వాత 57 ఏళ్లకు (2014 జూన్‌ 2) కాస్త సైజు తగ్గి నవ్యాంధ్ర ప్రదేశ్‌గా పుట్టుకురావడం పై పాపానికి ప్రతిఫలమేనని నమ్మేవాళ్లూ బెజవాడ, గుంటూరు నగరాల మధ్య ఒక మోస్తరు సంఖ్యలో ఉన్నారు.

Optimized by Optimole