Nancharaiah merugumala senior journalist:
” తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీ ‘స్వమూత్రపాన చికిత్స’తో 99 ఏళ్లు జీవించగా లేనిది రెండో గుజరాతీ పీఎం 97 ఏండ్లు బతకడం కుదరదేమోననే అనుమానం ఎందుకో! “
తొలి గుజరాతీ ప్రధానమంత్రి మొరార్జీ దేసాయి 81 సంవత్సరాలు నిండిన నెల తర్వాత 1977 మార్చి 24 దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. సంక్షుభిత భారత రాజకీయాల మధ్య కేవలం రెండేళ్ల 4 నెలలు ప్రధాని గద్దెపై కూర్చోగలిగారు సంపూర్ణ శాకాహారి మొరార్జీభాయ్ రణఛోడ్ జీ దేసాయి. పొగాకు, మద్యపానం అంటే ఏమాత్రం గిట్టని అవిభక్త బొంబాయి ముఖ్యమంత్రిగా (1952–56) కూడా పనిచేసిన మొరార్జీ (1896 ఫిబ్రవరి 29–1995 ఏప్రిల్ 10) 99 సంవత్సరాలు నిండిన 40 రోజులకు కన్నుమూశారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం స్వమూత్ర పానం (ఆటో యూరిన్ తెరపీ) మంచిదంటూ ప్రధానిగా ఉండగా ఇంటర్వ్యూల ద్వారా విశేష ప్రచారం చేశారు మొరార్జీ. చెప్పిన మాటలు ఆచరణలో పాటించిన ఆయన ‘సెంచరీ చేసే అవకాశం’ కొద్దిలో కోల్పోయారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఉపప్రధాని, ప్రధాని పదవుల వరకూ అన్నీ ఆలస్యంగానే మొరార్జీకి దక్కాయి. 56 ఏళ్ల వయసులో పూర్వ బొంబాయి స్టేట్ ప్రీమియర్ (ముఖ్యమంత్రికి పాతపేరు) పదవి, 62 సంవత్సరాల వయసులో కేంద్ర ఆర్థిక మంత్రి పదవి (పండిత నెహ్రూ కేబినెట్లో) ఆయన అందుకున్నారు. అలాగే నెహ్రూ జీ కూతురు ఇందిరమ్మ కేబినెట్లో మొరార్జీ భాయ్ 71 ఏళ్ల వయసులో ఉప ప్రధానిగా చేరి కేవలం రెండు సంవత్సరాలే కొనసాగారు. ఇండియాను 21వ శతాబ్దంలోకి తీసుకెళతానని 16 సంవత్సరాల ముందే 1985లో ప్రధాని హోదాలో ప్రకటించిన రాజీవ్ గాంధీ నూతన శతాబ్ది లేదా సహస్రాబ్ది చూడకుండానే 46 ఏళ్ల వయసులోనే 1991 మే 21న తమిళ నేలపై ప్రాణాలు విడిచారు. శ్రీపెరంబుదూరులో నాటి తమిళ ఈళం విడుదలై పుళి (ఎల్టీటీఈ) పథకం ఫలించడంతో బెల్టు బాంబు పేలుడులో రాజీవ్ 21వ శతాబ్దంలోకి ప్రవేశించడానికి 9 సంవత్సరాల ముందే మరణించారు.
ఇక ప్రస్తుత ప్రధాని, రెండో గుజరాతీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విషయానికి వస్తే– కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో అడుగుబెట్టిన అనుభవం ఏమాత్రం లేకుండానే ఆయన 51 సంవత్సరాలు నిండిన నెలకే 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు బీజేపీ తరఫున. వరసగా 13 ఏళ్లకు పైగా సీఎం పదవిలో కొనసాగిన తర్వాత 63 ఏళ్ల 8 నెలల వయసులో భారత ప్రధానిగా 2014 మే 26న ప్రమాణం చేశారు దామోదర్ దాస్ మోదీ మూడో సంతానం అయిన నరేంద్రభాయ్. రేపొచ్చే ఆదివారం భారత ప్రధానమంత్రి పీఠంపై ఆయనకు పది సంవత్సరాలు నిండుతాయి. గుజరాతీ తొలి ప్రధాని మొరార్జీ భాయ్ మాదిరిగా 99 ఏళ్లకు పైగా జీవించే అవకాశం వస్తే 2050 వేసవి వరకూ మోదీ జీ మన మధ్య ఉంటారు.