Nancharaiah merugumala senior journalist: (‘ఎర్ర బిడ్డలు’ పువ్వాడ అజయ్, చెన్నమనేని రమేష్ బీఆరెస్ లో ఉండగా తెలంగాణ కమ్యూనిస్టులకు మునుగోడు సీటు ఎందుకో!)
======================
మునుగోడు సీటు కోసం రైటు కమ్యూనిస్ట్ నేతలు చాడా వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డీ ఇక నుంచి నల్లగొండ కాంగ్రెస్ బడా నాయకులు కోమటిరెడ్డి వేంకట రెడ్డి, ఉత్తమ రెడ్డి, జానా రెడ్డి కాళ్లు మొక్కినా ప్రయోజనం ఉండకపోవచ్చు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ తలా రెండు అసెంబ్లీ స్థానాల కోసం రెడ్డి దొరల కాళ్లా వేళ్లా పడకుండా….పెద్ద పద్మనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బేషరతుగా లొంగిపోతే బావుండేది. కమ్యూనిస్ట్ పార్టీ 1934లో మొదట పుట్టిన బెజవాడ ప్రాంతంలోనే ఒక్క కార్పొరేటరూ కంకి-కొడవలి, కత్తి, సుత్తి, నక్షత్రం గుర్తులపై గెలవలేనప్పుడు… బంగారు తెలంగాణల కామ్రేడులు ఎందుకు 4 సీట్లలో పోటీకి టెన్షను పడుతున్నారో అర్ధం కావడం లేదు. ఇక్కడి పాలకపక్షం బీఆరెస్ లో సిరిసిల్ల మాజీ కామ్రేడ్ చెన్నమనేని రాజేశ్వరరావు గారబ్బాయి (పాత జర్మనీ నివాసి) సీ రమేష్ బాబు, ఖమ్మం కమ్యూనిస్టు యోధుడు పువ్వాడ నాగేశ్వరరావు గారి పుత్రరత్నం, రవాణా మంత్రి పీ అజయ్ కుమార్ ఉండగా తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలకు శాసనసభలో ప్రాతినిధ్యం అవసరమా? అనే ప్రశ్న సీతారాం ఏచూరి, డీ రాజాల మెదడుల్లో తలెత్తితే బావుణ్ణు.