విపక్షాలు వస్తే గానీ ధాన్యం కొనరా?: పవన్ కళ్యాణ్

Janasena: ‘అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందన్నారు పవన్ కళ్యాణ్. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి గింజకు ప్రభుత్వం పరిహారం ఇచ్చే వరకు కచ్చితంగా పోరాడుతామ’ని ఆయన తేల్చిచెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు మంగళవారం ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. పర్యటనలో కొత్తపేట నియోజకవర్గం, అవిడి గ్రామంలో రైతులను పరామర్శించారు. వర్షాల వల్ల తడిచిన ధాన్యం పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి వేదన విన్నారు.

ఈ సందర్బంగా మీడియాతో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ.. “దారి పొడుగునా రైతులను కలిసాం. వారంతా చెప్పేది ఒక్కటే. మేం దోపిడీలు, దొంగతనాలు.. అవినీతి చేయలేదు. కాంట్రాక్టులు చేయలేదు. నలుగురికి అన్నం పెట్టే మేము.. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా పంట కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాం అని చెప్తున్నారని అన్నారు. వర్షాలు రాక ముందే పంటను కొనుగోలు చేసే ప్రక్రియ మొదలుపెట్టి ఉంటే రైతులకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదన్నారు. ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడంతోనే క్షేత్రస్థాయిలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపు అకాల వర్షాల దెబ్బకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేస్తే, 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉందని.. అయితే ఇప్పటి వరకు కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారని జనసేనాని స్పష్టం చేశారు.

రాత్రికి రాత్రి గోతాలు రావడం విచిత్రం..

విపక్ష పార్టీలు రైతుల కోసం గొంత్తెత్తితేగానీ ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు పవన్. క్షేత్రస్థాయిలో రైతు పరిస్థితిని విపక్షాలు చెబితే గానీ ధాన్యం కొనుగోలుకు ముందుకు రాలేదన్నారు. ఇప్పటికీ ధాన్యం సేకరణ అంతంత మాత్రంగానే జరుగుతోందని.. ఇప్పటివరకు గోతాలు ఇవ్వని అధికారులు.. మేము వస్తున్నాం అని తెలియగానే రాత్రికి రాత్రి గోతాలు ఇవ్వడం విచిత్రంగా ఉందన్నారు. ఇప్పటి వరకూ లేని గోనె సంచులు ఎక్కడి నుంచి వచ్చాయని.. కొనుగోళ్లు హడావుడిగా చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. రైతు కన్నీరు పెట్టని రాజ్యం చూడాలి అన్నదే జనసేన లక్ష్యమని కుండ బద్ధలు కొట్టారు. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పోరాడుతుందని.. రైతులకు అండగా నిలుస్తుందని పవన్ పేర్కొన్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole