‘జన్మ సార్థకత’ అనే ఓ గొప్ప మాటుంది భారతీయ సంస్కృతిలో. కొంచెం అటిటుగా ప్రపంచపు అన్ని సంస్కృతుల్లోనూ ఇది ఉండే ఉంటుంది. ఇది, అంత తేలిగ్గా అందరికీ లభించదు. లభించడం మహా ఘనతే! ఎందుకంటున్నానంటే… ఇవాళ సాయంత్రం ఓ గంటన్నర సేపు సుమారు 120 కోట్ల మంది (2018 వల్డ్ కప్ ఫైనల్ 112 కోట్ల మంది వీక్షించినట్టు రికార్డు ఉంది) ప్రపంచ జనావళి చూపులు ఓ వ్యక్తి పైన కేంద్రీకృతమౌతున్నాయి. అంతకు రెట్టింపు సంఖ్యలో అంటే, సుమారు 250 కోట్ల మంది (దాదాపు మూడో వంతు ప్రపంచ జనాభా)… ఆయనను ప్రత్యక్షంగానో, టీవీ లైవ్ లు, స్ట్రీమింగ్ ద్వారా చూడటమో, చదవటమే, వినటమో, చర్చించటమో…. ఏదో ఒకటి, వచ్చే 24 గంటల్లో భూగ్రహమ్మీద ఎక్కడో ఓ అక్కడ జరుగుతూ ఉంటుంది. వాటన్నింటికీ ఆయన కేంద్ర బిందువు అవుతారు. ఆయనే…. అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ కెప్టెన్, ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారుడు లియోనల్ మెస్సీ! ఒక వ్యక్తి ఇంతగా సాటి మనుషుల దృష్టినాకర్శించడం చాలా అరుదైన విషయం. ఖతర్ రాజధాని దోహా లోని లుసాయిల్ మైదానంలో, అర్జెంటీనా-ఫ్రాన్స్ ల మధ్య జరుగుతున్న ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ లో ఆయనే ప్రధాన ఆకర్షణ. విశ్వపు మేటి జట్లలో ఒకటైన అర్జెంటీనా 36 ఏళ్ల కల ను నేరవేర్చేలా ప్రతిష్టాత్మక ఫీఫా కప్ ను 88వేల మంది ప్రేక్షకుల మధ్య… మెస్సీ ముద్దాడుతాడా? టీమ్ ఓడితే కంట తడితో నిష్క్రమిస్తాడా? అన్నది ఇపుడు ఉత్కంఠ.
ఎనిమిదేళ్ల కింద, (2014-బ్రెజిల్) మెస్సీ మాంచి ఊపు మీదున్నపుడు… ఇలాగే ఆర్జెంటీనాను ఫైనల్ వరకూ తెస్తే ఊరించిన కప్పు, జర్మనీ 1-0 ఫైనల్ విజయంతో నెరవేరని కలగానే మిగిలిపోయింది. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఉర్రూతలూపుతూ1986 మెక్సికోలో, ఫుట్బాల్ మాంత్రికుడు డీగో మారడోనా అందించిందే, ఆర్జెంటీనాకు చివరి కప్పు. మూడున్నర దశాబ్దాల ఆ వేటకు తెరదించాల్సింది…. 20 ఏళ్ల కింద (బార్సిలోనా లో) ఫీఫా వల్డ్ కప్ ఎరేనా లోకి అడిగిడిన నుంచి, పోటీ పోటీకి మరింత ఎదుగుతూ వస్తున్న మెస్సీకి, ఆయన నేతృత్వపు ప్రస్తుత జట్టుకే సాధ్యమని, ఇదే పీక్ సమయమని అర్జెంటీనా, ఆ మాటకొస్తే ఫుట్బాల్ జగత్తే బలంగా నమ్ముతోంది. ఆయన అంతటి అద్బుత ఆటగాడే! 5 వల్డ్ కప్ ఈవెంట్లలో 25 మ్యాచ్ లు ఆడి, స్వయంగా 11 గోల్స్ చేయడమే కాకుండా మరో 8 గోల్స్ చేయడంలో సహచరులకు సహాయపడి రాటుదేలిన మేటి మెస్సీ! లీగ్స్ నుంచి ప్రపంచ స్థాయి పోటీల వరకు ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, రికార్డులు సొంతం చేసుకున్న అతనికి ఫీఫా వల్డ్ కప్ ఒకటే… ఇప్పటి వరకు అందని ద్రాక్ష లా ఉంది. ప్రస్తుత ఎడిషన్ లో కూడా ఇప్పటికే సొంతంగా 5 గోల్స్ చేయగా, సహచరులు చేసిన 3 గోల్స్ లో తన సహాయముంది. అలాంటి మెస్సీ ఆటను ప్రత్యక్షంగా స్టేడియంలో చూడాలని ఎవరికుండదు? అందుకే, 88,900 సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో ఫైనల్ ఆట ప్రవేశానికి, తమకు తగిన వాటా టికెట్లు ఇవ్వట్లేదని ఆ దేశ అభిమానులు రెండ్రోజులుగా దోహాలో నిరసన, ఆందోళన బాట పట్టారు. ఎందుకంటే, మరి 30,000 మంది ఆర్జెంటీనియన్లు ఇప్పటికే ఖతర్ వచ్చి ఉన్నారు. మామూలుగా లభించని టికెట్లు బ్లాక్ లో అయినా కొందామంటే, ఒక్కోటి 4000 అమెరికన్ డాలర్లకు రహస్య స్థావరాల్లో దొంగచాటుగా అమ్ముతున్నారు. ‘మరేం చేస్తాం, 35 ఏళ్లున్న మెస్సీ ఇంకో వల్డ్ కప్ ఆడరు’ అన్నది సగటు అభిమాని బాధ!
పెద్ద అడ్డుగోడ ఎంబాపె:
ఇంతటి చరిత్ర కలిగిన మెస్సీ బృందానికి నేటి ఫైనల్లో అతిపెద్ద అడ్డుగోడ, ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె. అతనేం తక్కువ తిన్నవాడు కాదు! 2018 ఫ్రాన్స్ ని విజేతను చేసి, వరుసగా రెండో కప్పు దేశానికి అందించాలని చూస్తున్న తెంపరి. ఆయనా… ఇప్పటికే ఈ ఎడిషన్ఆలో 6 మ్యాచ్ లు ఆడి, 5 గోల్స్ చేసి, సహచరుల 2 గోల్స్ కి సహకరించిన యోధుడే! ఈ ఇద్దట్లో ఏ యోధుడి కల నెరవేరి, మరే యోధుడి కల భగ్నమౌతుందీ? అనే ఉత్కంఠ కు తెరపడ్డానికి…. ఇంకొన్ని గంటలే!
===================
ఆర్. దిలీప్ రెడ్డి
పీపుల్స్ పల్స్ డైరెక్టర్