నల్గొండ, జూలై 12:
ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురైన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విషాదాన్ని నింపింది. చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన రూపని అఖిల్ (24) అనే యువకుడు బీటెక్ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. వేతనం తక్కువగా ఉండటంతో ఏడాదిన్నర క్రితం ఊరికి తిరిగొచ్చాడు.
ఆ తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఏడాది కాలంగా ప్రయత్నించినప్పటికీ సరైన అవకాశం రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అఖిల్ చిట్యాల రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లుతున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.