పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్న వైసీపీ ప్రభుత్వం: నాదెండ్ల మనోహర్
Janasena : ‘ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే మూక దాడులు… అభివృద్ధిపై నిలదీస్తే పోలీస్ కేసులు పెట్టిస్తున్న వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని మండిపడ్డారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. అధికార పార్టీ అక్రమాలను అడ్డుకుంటూ, లోపాలను ఎత్తి చూపుతున్న వారిపై వ్యవస్థలను ఇష్టారీతిన ప్రయోగిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలను బెదిరించామని సంబరపడుతోందన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలెవరూ బెదిరింపులకు భయపడేవారు కాదాని.. మీరు ఎంత బెదిరిస్తే అంత బలంగా పోరాడుతామని.. బలపడతామని వైసీపీ దమనకాండపై దండెత్తుతామ’ని ఆయన హెచ్చరించారు. ఈనెల 22వ తేదీన విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం, బెవరపేటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు 14 మందిపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సామూహిక దాడి చేసి గాయపరిచిన ఘటనలో తీవ్ర గాయాలు పాలై ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేయాల్సిన సీరియస్ స్థితికి వెళ్లిన జన సైనికులను మనోహర్ శనివారం విజయనగరం జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మీసాల అప్పారావు, మీసాల సాయిలతో మనోహర్ మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మరో క్షతగాత్రుడు మీసాల రామకృష్ణకు శనివారం సర్జరీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా బాధితులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా నిలబడుతుందని, అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఎల్లప్పుడూ ఉంటుందని మనోహర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ “రేషన్ కార్డు కోసం రూ.3 వేలు, ఇంటి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.80 లక్షల్లో రూ.30 వేలు ఇవ్వాలని బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్న వైసీపీ నాయకుల తీరును జన సైనికులు ప్రశ్నించడంతోనే వైసీపీ నాయకులు కక్ష పెంచుకున్నారు. అంతటి అవినీతి చేసి, మీరు మా ఇంటికి జగనన్న భరోసా స్టిక్కర్లు ఎలా వేస్తారని ప్రశ్నించిన వారిపై మూకుమ్మడి దాడికి దిగారు. ఇతర ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి కూడా అధికార పార్టీ కార్యకర్తలను తీసుకువచ్చి జనసేన పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లపై దాడులకు తెగబడడం అత్యంత హేయం. ఈ ఘటనలో జన సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు, చేతులు విరిగిపోయేలా క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, ఇతర మారణాయుధాలు తీసుకువచ్చి దాడులు చేశారు. రాష్ట్రంలో నియంత రాజ్యం నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు ప్రశ్నించకూడదు… మాట్లాడకూడదు అన్న చందాన రాష్ట్రంలో రాక్షసత్వం సాగుతోంది. దీనిని జనసైనికులంతా పోరాట పంథాలో తిప్పి కొడతామని మనోహర్ హెచ్చరించారు.
పచ్చబొట్లు వేసుకుని తిరగండి..
స్నేహపూర్వక వాతావరణం లో ఉన్న గ్రామాల్లో విద్వేషాలను రెచ్చగొట్టి వైసీపీ ప్రభుత్వం విభేదాలు సృష్టిస్తోందన్నారు మనోహర్. పచ్చగా ఉండే పల్లెల్లో రాజకీయ ఘర్షణలు సృష్టించి చిచ్చు పెడుతోందన్నారు. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ప్రభుత్వం స్టిక్కర్లు ప్రజలు ఎందుకు వేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి చేతకాని సీఎం బొమ్మలు ఎందుకు ఇళ్లకు అతికించుకోవాలన్నారు. జగనన్న భరోసా స్టిక్కర్లు వేయించుకోకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని చెప్పడం చట్ట విరుద్ధమని దుయ్యబట్టారు. అత్యంత దుర్మార్గం. ప్రభుత్వం అంటే ఒక పార్టీ కాదు.. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని హితువు పలికారు. వైసీపీ ప్రభుత్వం కేవలం ఒక పార్టీకి మాత్రమే పనిచేస్తుందన్నారు. దీనిపై కార్యకర్తలతో కలిసి జనసేన నాయకత్వం అంతా సమష్టిగా, బలంగా పోరాడుతుందన్నారు. వైసీపీ నాయకులకు అంతగా జగనన్న పై అభిమానం ఉంటే ఆయన పచ్చబొట్లు ఒళ్లంతా వేయించుకుని తిరగండని ఎద్దేవ చేశారు. ఆయనపై ఉన్న అభిమానాన్ని ప్రజల్లో చాటండి.. అంతేగాని ప్రజలను బలవంతంగా స్టిక్కర్లు అతికించుకోవాలని చెప్పే హక్కు మీకు ఎక్కడిది..? ఇది పూర్తిగా అవివేక చర్యగా మనోహర్ అభివర్ణించారు.