ఓ వైపు కరోనా వైరస్.. ఫస్ట్ ..సెకండ్ వేవ్ సృష్టించిన బీభత్సం నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. మరోవైపు ‘మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు చందంగా’ డెల్టా వేరియంట్ రకరకాల వేరియంట్లతో భయపెడుతోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో వైరస్ జికా రూపంలో వెలుగులోకి వచ్చింది. ఇది ప్రమాదకరం కానప్పటికీ పిల్లలలో పెరుగుదలను ప్రభావితం చేస్తుందని వైద్యం నిపుణులు. హెచ్చరిస్తున్నారు.
దేశంలో జికా వైరుస్ మొట్టమొదట కేరళలో వెలుగుచూసింది. తిరువనంతపురం జిల్లాలో ఈ ఈ వైరస్ లక్షణాలు ఉన్న మరో 13 మంది వైద్య సిబ్బందిని.. పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు శాంపిళ్లను పంపించగా.. 12 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. అంతకుముందు 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్ తొలిసారి వెలుగు చూసింది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. బిడ్డలో వైరస్ లక్షణాలు లేనందున ఊపిరి పీల్చుకున్నారు.
జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.