ఆషాడ మాసం అనగానే కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. అత్తా అల్లుళ్లు ఎదురుపడకూడదనే ఆచారం కూడా ఉంది. దీనికి వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. కొత్తగా వివాహమైన దంపతులు ఒక నెల ఎడబాటు తర్వాత కలుసుకుంటే వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతుందని అంటారు. అసలు ఆషాడమాసం వెనుక దాగున్న విషయం ఏమిటి? ఈ ఆచారం ఎందుకు పాటించాలి?
మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత వుంది. పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ_మాసం. ఇది తెలుగు సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల.. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్ర లోకి వెళ్ళే సందర్భాన్ని తొలి_ఏకాదశి గా పరిగణిస్తారు. ఆషాఢ_శుద్ధ_పౌర్ణమి రోజును గురు_పౌర్ణమి గా వ్యవహరిస్తారు.
ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఈ మాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాడ_మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఈ శూన్య మాసంలో… ఆషాఢ_శుద్ధ_విదియ నాడు పూరీ జగన్నాధ రధయాత్ర.. ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’ గా పిలువబడుతుంది.
ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము – సృమతి కౌస్తుభం’ … ఈనాడు వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి.
శూన్య మాసం అంటే..?
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు. అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి ఉంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభ రాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శని గ్రహం 2 1/2 సం. పడుతుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు.. ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొప్పున (మేషాది మీనరాశులు) 12 రాశుల లోనూ 12 నెలలు సంచరిస్తే.. సంవత్సర కాలం పూర్తవుతుంది.
సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని, సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని, సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని, సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని… ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెబుతారు.
ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు_పూర్ణిమ కూడా. దీనినే వ్యాస_పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు. ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్య స్వామిని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠిని కుమార షష్ఠిగా జరుపుకొంటారు.
ఆషాడ సప్తమి భాను సప్తమిగా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు 3 నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి.
ఆషాడ_శుద్ద_ఏకాదశి ని తొలి_ఏకాదశి అని శయన_ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయ బద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటు వంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి.
ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్త గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్త వారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్త వారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాడ మాస నియమం పెట్టారు.
అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను, అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు.
ఇలా అనేక కారణాల వలన ఆషాఢ మాసాన్ని నిషిద్ధ మాసం అంటారు. ఇక ఈ మాసంలో స్త్రీ గర్భం దాలిస్తే ప్రసవ సమయానికి ఎండాకాలం వస్తుంది. ఎండ తీవ్రత తల్లీపిల్లలకు మంచిది కాదు.
ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు కట్టుబాట్లు పెట్టారు. ఇక ఈ మాసంలో చాతుర్మాస్య దీక్షలు, వ్రతాలూ చేస్తారు. ఇక ఈ మాసంలో మనిషిలోని సప్త ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. అందుకే ఆషాడం అనే నియమం పెట్టారు. ఇక దీక్షలు కూడా ఈ మాసాల్లోనే మొదలవుతాయి. ఎండా కాలం వేడిమికి భూతాపం హెచ్చి వర్షాకాలంలో భూమిలోకి నీరు ఇంకుతుంది. అందుకే, తద్వారా పండే కూరగాయలను తినకూడదని నియమం పెట్టారు.
ఇక చాతుర్మాస్య రెండవ మాసం శ్రావణ మాసంలో పెరుగు తినకూడదు. మూడవ నెల భాద్రపద మాసంలో పాలను తాగకూడదు. చివరి మాసం ఆశ్వయుజ మాసంలో కంది, పెసర, సెనగ మొదలుగు పప్పు ధాన్యాలు తినకూడదని పెద్దలు నియమం పెట్టారు.ఈ మాసంలో వచ్చే క్రిమి కీటకాదులు పోవాలంటే, కనీసం మూడు సార్లు అయినా ఆవు పేడతో కాల్చిన పిడకలతో ధూపం వేయాలి. మైసాక్షి వంటి ధూపాన్ని ఇంట్లో వేస్తే క్రిమి కీటకాలు నివారించబడతాయి. ఇక ఈ కాలంలో వేప, మామిడి, జామ, మొదలైన మేలు చేసే పండ్ల మొక్కలు నాటాలి.
ఆషాడ_మాసం_వైశిష్ట్యం:
శుభకార్యాలకు పనికిరాదు అని భావింప బడుతున్నా… ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసరించే మాసం ‘ఆషాడ మాసం’ నాలుగు నెల. ఈ మాసం లోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాడ నక్షత్రం సమీపంలో గానీ సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ‘ఆషాఢ మాసం’ అనే పేరు ఏర్పడింది.
రోజు కాకపోయినా ఆషాడ మాసంలో శుక్ల పక్ష షష్ఠి నాడు శ్రీసుబ్రహ్యణ్యస్వామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.
ఆషాడమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాడ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ఆషాడ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది.
కాగా ఆషాడ మాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాడ మాసంలో కొత్తగా అత్త వారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం.. అంటే పెళ్ళయిన తొలి ఆషాడ మాసంలో అత్తా కోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కాని సామాజికంగ, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాడ మాసంలో భార్య భర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే వరకు చైత్ర, వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.
ఆషాడ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్య దినాలు ఉన్నాయి.
శుక్ల పక్ష ఏకాదశి : తొలి ఏకాదశి
దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా పేరు. శ్రీమహావిష్ణువు ఈ దినం మొదలుకొని నాలుగు నెలల పాటు పాల కడలి లో శేష శయ్యపై శయనించి యోగనిద్ర లో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి. మరునాడు ద్వాదశి నాడు తిరిగి శ్రీమహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాన్య వ్రతం ప్రారంభమవుతుంది.