బీహార్ ప్రభుత్వ కీలక నిర్ణయం

పట్నా: ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరువుకు భంగంకలిగించే తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే సైబర్ క్రైమ్ నేరాల కింద చర్యలు తీసుకోనున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవడం బీహార్ లో చాలా అరుదు. అయితే ఈ తరహా ప్రచారం మరీ శృతిమించుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయ్యే తప్పుడు సమాచారాన్ని తమ దృష్టికి తీసుకురావాలని  కోరుతూ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఐజి నయ్యర్.హెచ్.ఖాన్ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు గురువారం లేఖ రాశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై కొంతమంది వ్యక్తులతో పాటు కొన్ని సంస్థలు అసత్య ప్రచారానికి తెగబడుతున్నారని.. ఇలాంటి ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటివి చట్ట వ్యతిరేకమని, సైబర్ నేరాల కిందకు వస్తాయని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే ఎలాంటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సీఎంపై తేజస్వి విమర్శలు…
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అవినీతి చేయడంలో, అవినీతి పరులను కాపాడటంలో నితీష్ కుమార్ ‘ భీశ్మ్ పితామహుడు ‘ అంటూ విమర్శించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే తాను పెడుతున్న ఈ పోస్టుపై తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.