టీఆర్పీ రేటింగ్స్ రిగ్గింగ్!

దేశవ్యాప్తంగా ప్రింట్ పత్రికల రేటింగ్స్ కి సంబంధించి ప్రతి ఏటా జరిగే గోల్మాల్ రిగ్గింగ్ విషయం అందరికి తెలిసిందే. పత్రికా సంస్థలు ఏబిసికి చెప్పే లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన ఉండదనేది కాదనే వాస్తవం. ఈ రేటింగ్స్ రిగ్గింగ్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు పాకీ దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ప్రేక్షకాదరణకు కొలమానమైన టీవీ చానళ్ల టీఆర్పీ రేటింగ్స్లో బార్క్( బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) మాజీ పెద్దలు రేటింగ్స్ రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయమై తెలుగు రాష్ట్రాలోని ఓ ప్రముఖ చానల్ బార్క్ మాజీ పెద్దలపై బాహాటంగానే ఆరోపణలు చేసింది. చానళ్ల రేటింగ్స్ ను తమకు నచ్చిన విధంగా పెంచుతూ ,తగ్గిస్తున్నట్లు ఏఆర్సీ సంస్థ పరిశోధనలో తేలినట్లు వెల్లడించింది.
జాతీయ మీడియాలోని ప్రముఖ చానల్ తో పాటు రెండు మరాఠీ చానల్స్ రేటింగ్స్ రిగ్గింగ్ కు పాల్పడ్డాయంటూ ముంబై పోలీసులు కేసు నమోదుచేయడం.. రిగ్గింగ్ స్కాములో బార్క్ మాజీ సీఈఓ దాస్ గుప్తా తో పాటు పలువురు ప్రముఖులు అరెస్ట్ కావడంతో చానళ్ల రిగ్గింగ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.