2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు ఎదుర్కొనబోయే పదో రాష్ట్రం అవుతుంది. అంటే, దేశంలో మూడో వంతు రాష్ట్రాలు ఈ యేడాది కాలంలో ప్రజాతీర్పుకు సన్నద్దమవుతున్నాయి. అందుకే ఈ యేడాదిలో జరిగే ఎన్నికల్ని సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నారు. క్రీడల్లో అయితే సెమీఫైనల్లో ఓడిపోతే ఇక ఇంటికే! కానీ, రాజకీయాల్లో సమీస్‌లో ఓడినా ఫైనల్‌కు వెళ్లచ్చు. ఎన్నిసార్లు ఓడినా మళ్లీ మళ్లీ పోటీ చేయొచ్చు. ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే! 2014 తర్వాత ఓ మూడు రాష్ట్రాలు మినహా, పోటీ చేసిన చోటల్లా ఓటమిని ఎదుర్కొంది. మరోవైపు పాలకపక్షమై బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. అందుకు, ఆ పార్టీకి ప్రస్తుతం పెద్దదిక్కుగా ఉన్న ప్రధాని మోదీ చరిష్మాకు తోడు చాలా చాలా కారణాలే ఉన్నాయి. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అన్ని శక్తుల్ని మోహరించి, సమస్త వనరుల్నీ వినియోగించడం, నిర్దిష్ట వ్యూహాలు, ఎత్తుగడలతో కడవరకూ ఓటమిని అంగీకరించని పోరాటతత్వం ప్రదర్శించడం వంటివి ప్రధాన విజయ కారకాలుగా చెప్పొచ్చు. అంతటి స్థాయిలో జాగ్రత్తలు తీసుకునే బీజేపీ కి కూడా ఈ యేడాది పరీక్షా కాలమే! చాలా అవకాశాలున్నాయి, కానీ అదే స్థాయిలో సవాళ్లూ ఉన్నాయి. మరో రకంగా చెప్పాల్సి వస్తే, కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది పరీక్షా సమయమే! ఎందుకంటే, పార్టీలో చోటుచేసుకున్న రెండు కీలక పరిణామాల తర్వాత జరుగుతున్న పెద్ద ఎన్నికలివి. ఒకటి గాంధీ`నెహ్రూ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు దక్కడం. రెండు ‘భారత్‌జోడో’ అంటూ కాంగ్రెస్ ముఖ్యనాయకుడు రాహుల్ గాంధీ దేశమంతా చుట్టిరావడం తర్వాత జరుగుతున్న ఎన్నికలివి. అందుకే, ఆ పార్టీకి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే కాకుండా ఓ చక్కటి అవకాశం!
రేపటి బడ్జెట్ కీలకం..
దేశంలోని 116 లోక్‌సభ స్థానాలతో కూడి ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ఏడాది ముంగిట్లో జరుగుతుండటం ప్రాధాన్యతాంశమే! ఫిబ్రవరి`మార్చిలో ఈశాన్య భారతంలోని త్రిపుర, మెఘాలయ, నాగాలాండ్ లలో, ఏప్రిల్`మే మాసాల్లో మన పొరుగునున్న కర్ణాటకలో, నవంబరు`డిసెంబరు మాసాల్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాంలలో ఎన్నిలకు జరుగనున్నాయి. ఇవి కాకుండా ఓ పది రాజ్యసభ స్థానాలకూ జూలై`ఆగస్టు మాసాల్లో ఎన్నికలు జరగాలి. రాష్ట్ర హోదాను ఇచ్చి కశ్మీర్‌కు మేలో ఎన్నికలు జరిపే అవకాశాలున్నాయనే ప్రచారమూ జరుగుతోంది. దేశంలో అసాధారణంగా పెరిగిన నిత్యావసరాల ధరలు, తారా స్థాయిలో నిరుద్యోగిత, ఆర్థిక అసమానతలు, సిద్దాంత వైరుధ్యాలు, మత విద్వేషాలు, సామాజిక అస్థిరత, రాజకీయ కక్ష సాధింపులు, నిస్గిగ్గు పార్టీ మార్పిళ్లు…. వంటివి ఇప్పుడు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల్లో పౌరసమాజం ఎలా స్పందిస్తుంది అన్నది ప్రామాణికం అవుతుంది. వచ్చే యేడు ఎన్నికల్లో లబ్ది పొందే క్రమంలో, ఈ యేటి ఎన్నికలను ప్రయోగంగా మలుచుకోవాలనుకునే పాలకపక్షం అధికారిక వ్యూహాలతో ఎత్తులు వేస్తుందనడంలో ఏ సందేహమూ లేదు. రేపటి ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్ బీజేపీ నాయకత్వానికి ఒక అవకాశం. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా బడ్జెట్ రూపొందించడం ద్వారా రాజకీయంగా ఆధిక్యత పొందడానికి ప్రయత్నిస్తుంది. సగటున ప్రతినెలా లక్షాయాబై వేల కోట్ల జీఎస్‌టీ వసూలు చేస్తున్న క్రమంలో… బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రజా ఆసక్తి పెరగటంలో ఆశ్చర్యం లేదు. గత సంవత్సరం (2022) ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఐదు చోట్ల (గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్) ప్రధానంగా బీజేపీ తమ ప్రభుత్వాలను నిలబెట్టుకుంది. పంజాబ్‌లో గెలిచి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢల్లీి బయట తొలిసారి పాగా వేస్తే, హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచి కాంగ్రెస్ తన భవిషత్ ఆశల్ని చిగురింపజేసుకుంది. పెద్దగా సమయ వ్యత్యాసం లేకుండా 2023లో వస్తున్న 9 రాష్ట్రాల తాజా ఎన్నికలు పాలక`విపక్షాలకు కీలకంగా మారాయి.
తరం మార్పిడే పెద్ద సవాల్..
ఎదుటి వారి బలహీనత మనకు బలం కావటం రాజకీయాల్లో కలిసివచ్చే అంశమే! కానీ, సుదీర్ఘకాలం అదే బలాన్ని నమ్ముకొని ఉండలేమని బీజేపీ గుర్తించాల్సిన సమయం వచ్చింది. పైగా తరం మారుతోంది. వృద్ద తరాన్ని గద్దెదింపి కొత్త తరానికి కాగడా అందించాల్సిన సమయం అని బీజేపీ నాయకత్వం గ్రహించినా… కొన్ని చోట్ల చేతులు కాలుతున్నాయి. తరాల మధ్య అంతరం పెరిగి, ఆ స్పర్థ ముదిరితే రాజస్థాన్‌లో ఇప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభం వంటిది పలు చోట్ల బీజేపీకీ తప్పదు. ఎందుకంటే, బీజేపీ కూడా అధికార పక్షంగా పాతపడుతోంది. హిమాచల్‌ప్రదేశ్ అనుభవాలక కొత్త పాఠం. 30 నుంచి 40 శాతం మందికి టిక్కెట్లు మార్చిన ప్రయోగాలు అక్కడక్కడ వికటించాయి. అందుకు మొన్నటి రaార్ఖండ్, నిన్నటి హిమాచల్ ప్రదేశ్ ప్రతికూల ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనం. విపక్షాలు బలంగా లేకపోవటం వల్ల అదే ప్రయోగం గుజరాత్, ఉత్తరాఖండ్‌లో ఫలించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా అనుభవి యెడ్యూరప్పను యువతరం ప్రతినిధి బసవరాజ్ బమ్మై తో మార్పిడి చేసిన ప్రయోగం ఏ ఫలితం ఇస్తుందో తెలియడానికి ఇంకో నాలుగయిదు మాసాలు నిరీక్షించాల్సిందే! ఇప్పటికైతే సానుకూల సంకేతాలు లేవు. 2014 తర్వాత ఎనిమిదేళ్ల కాలం బీజేపీ కి విజయపథమే! బీజేపీ నేతృత్వపు ఎన్డీయే వరుసగా రెండు లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్ని గెలవటమే కాకుండా దేశంలోని 16 రాష్ట్రాల్లో తిష్టవేయగలిగింది. అందులోని ఓ 5 రాష్ట్రాలు ఇప్పుడు ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. ‘2014 నుంచి 8 ఏళ్లలో పార్టీ సంస్థాగతంగా బీజేపీ పలురెట్లు ఎదిగింది. ఈ కాలంలోనే ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు పథకాలు దేశంలో 80 శాతం మందిని చేరాయి’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ చెప్పిన మాటల్లో, ఎన్నికల విజయాలు ఇక మాకు సాధారణమే అన్న పార్టీ ధీమా ధ్వనిస్తుంది.
కాంగ్రెస్‌కు గొంతు పెగల్చిన హెచ్‌పీ..
కాంగ్రెస్‌ను దేశంలోనే లేకుండా చేయాలి (కాంగ్రెస్ ముక్త్ భారత్) అన్న బీజేపీ నినాదానికి గండి కొట్టిన ఎన్నికల ఫలితం హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీకి దక్కింది. అంతకు ముందు వరకు, దేశం మొత్తమ్మీద రెండు రాష్ట్రాలకే (రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్) కాంగ్రెస్ పరిమితమైంది. ఆ రెండు రాష్ట్రాలూ ఈ సవంత్సరాంతంలో ఎన్నికల్ని ఎదుర్కొంటున్నాయి. పట్టుబట్టి బీజేపీ ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీస్తే, 2024 ముందు, వారు కోరుకున్న కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదానికి మరింత ఊపు లభించేది. కానీ, దానికి గండికోడుతూ పార్టీకి సానుకూలంగా లభించిన హిమాచల్ ప్రదేశ్ ఫలితం కాంగ్రెస్‌కు కొత్తశక్తినిచ్చింది. పార్టీ నాయకత్వంపై సుదీర్ఘ కాలంగా ఉన్న విమర్శల్ని తిప్పికొడుతూ గాంధీయేతర కుటుంబీకుడైన మల్లికార్జున్ ఖర్గేను పార్టీ అధ్యక్షుడిని చేసుకొని పార్టీ నైతిక స్థయిర్యాన్ని పెంచుకుంది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సాగిస్తున్న భారత్ జోడో యాత్ర పార్టీ వ్యవస్థకు కొత్త టానిక్‌లా పనిచేస్తోంది. ‘పప్పు’ ముద్ర పోయి, పార్లమెంటులో ఇప్పుడు రాహుల్ గొంతు మరికొంత గాంబీర్యతను సంతరించుకోవచ్చు. ఇటు ఈ రెండు పరిణామాలు, అటు హిమాచల్ ఫలితం కాంగ్రెస్ రేటింగ్ పెంచాయి. ఈ ఊపులోనే వచ్చే ఎన్నికల్లో…. ఇప్పుడున్న రెండు రాష్ట్రాలు (రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్) నిలబెట్టుకొని, కొత్తగా కర్ణాటక, మధ్యప్రదేశ్ తెచ్చుకోగలిగితే కాంగ్రెస్ తిరిగి గాటన పడ్డట్టే! గుజరాత్ ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకొని, ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకొని, వ్యూహాత్మకంగా వ్యవహరించడమనే తెలివిడి కాంగ్రెస్ చూపించగలిగితే, ఎన్నికల రాజకీయాల్లో ప్రతి పరీక్షలోనూ ఒక అవకాశం ఉంటుందనేది రుజువవుతుంది.
విపక్ష ఐక్యతకూ ఈ యేడు ముఖ్యమే!
మూడో సారి దేశంలో అధికారం దక్కించుకోవడానికి ‘మోదీ చరిష్మా’ ఒక్కటే సరిపోదని బీజేపీ గ్రహిస్తున్న క్రమంలోనే… విపక్షాలు కూడా, 8 ఏళ్ల అనుభవాల నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ నిజంగానే అయిదు రాష్ట్రాల అధికారానికి ఎదిగితే, ఇతర విపక్షాలు కాంగ్రెస్ ఛత్రఛాయలోకి వచ్చి విపక్ష ఐక్యత సాధ్యపడవచ్చు. ఢల్లీి, పంజాబ్ కైవసం తర్వాత గుజరాత్ (5), గోవా(2) ల్లో ప్రభావం చూపి ఆప్‌జాతీయ హోదా దక్కించుకుంది. త్రిపుర, మేఘాలయాలో ఎంట్రీ ప్రయత్నాల్లో తృణమూల్ విస్తరిస్తోంది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్ చేసిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టారు. తెలంగాణ రాజకీయ చిత్రం ఎలా ఉండనుందో తేలేది ఈ సంవత్సరమే! 2025 లో బీహార్ సీఎం తేజస్వీ యాదవ్ అని ప్రకటించిన ఆ రాష్ట్ర ప్రస్తుత సీఎం భవిష్యత్ గురి ఎక్కడ? అనేది స్పష్టమయ్యేది ఈ ఏడాదే! కావున 2024 కు ముందర 2023 రాజకీయ దిక్సూచి కావడం ఖాయం.
===================================
-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,