తెలంగాణలో బిఆర్ఎస్- కాంగ్రెస్ కలిసి పోటిచేయబోతున్నాయా? రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదన్న ఆపార్టీ ఎంపీ వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటి? సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత పొత్తు కోసం కాంగ్రెస్ అధినేత్రిని కలిసిందన్న వార్తల్లో వాస్తవమెంత? ఒకవేళ రెండు పార్టీల పొత్తు కుదిరితే పీసీసీ చీఫ్ రేవంత్ దారెటు?
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పార్టీల పొత్తులపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అధికార బిఆర్ ఎస్ – కాంగ్రెస్ పొత్తుపై కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. తాజాగా రెండు పార్టీల పొత్తుపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో హంగ్ ఏర్పడటం ఖాయమని.. ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదని..కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదని వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త చర్చకు దారితీశాయి.
అటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 40 సీట్లు మాత్రమే గెలిచే అవకాశముందని..కొత్తైనా.. పాతైనా గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఎంపీ సూచించారు.సమయం ఎక్కువ లేనందున మార్చి 1 నుంచి పాదయాత్ర లేదా బైక్ యాత్ర చేస్తానని.. పార్టీ నేతల తమ తమ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇదిలా ఉంటే .. కొద్ది రోజులుగా సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ..కాంగ్రెస్ తో పొత్తు కోసం ఢిల్లీలో ఆపార్టీ పెద్దలను కలిసిందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. అగ్నికి ఆజ్యం పోసేలా కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. బిఆర్ ఎస్ – కాంగ్రెస్ జతకట్టే అస్కారం లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాక కాంగ్రెస్ ఎంపీ అన్నట్లు హంగ్ వస్తే.. కేసీఆర్ కాంగ్రెస్ తో నడవక తప్పదన్నది వారి వాదనగా వినిపిస్తోంది.
ఇక హాత్ సే హాత్ జోడో యాత్రతో పీసీసీ చీఫ్ రేవంత్ ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ -బిఆర్ ఎస్ పొత్తు కుదిరితే రేవంత్ ఆపార్టీలో కొనసాగుతారా? లేదా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న? కేసీఆర్ ను అధికారం పీఠం నుంచి దింపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయనకు ..రెండు పార్టీల పొత్తు వ్యవహరం మింగుడుపడని అంశమని అతని అనుచరగణం మాటగా తెలుస్తోంది.
మొత్తంమీద సంచలనాలకు కేంద్ర బిందువైన కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్టేట్ ఆఫ్ ది టాపిక్ గా మారాయి.