singareni : సింగరేణి సంస్థను కాపాడాలని కోరుతూ కేసీఆర్ కు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

singareni :సింగరేణి తెలంగాణ కల్పతరువు. తెలంగాణ పాలిట వరప్రదాయనే కాదు తెలంగాణ కు సింగరేణి ఓ గ్రోత్‌ ఇంజిన్‌. కానీ నేడు సింగరేణి మనుగడపై మన్ను పోసింది ఎవ్వరు? వేలాది మందికి ప్రత్యక్షంగా లక్షల మందికి పరోక్షంగా ఉపాధినిచ్చే సింగరేణిలో ఇప్పుడు ఉద్యోగాలు ఎందుకు పెరగడం లేదు? ఉన్న ఉద్యోగులు ఎందుకు తగ్గిపోతున్నారు? వేల కోట్ల డిపాజిట్లతో లాభాల బాటలో ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పుల కోసం బ్యాంక్‌ ల చుట్టు తిరుగుతున్నారు? సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టింది ఎవ్వరు? భూగర్బ గనుల్లో ప్రాణాలు పణంగా పెట్టి రక్తాన్ని చెమటగా చిందిస్తూ జాతికి వెలుగులు అందించే కార్మికుల జీవితాల్లో చీకట్లు నింపుతుంది. ఎవ్వరు? పోరాటాలకు పిడికిలి బిగించే కార్మికవాడల్లో ఉద్యమాలు అణచివేయడమే కాదు కార్మిక హక్కులను కాలరాసింది ఎవ్వరు? నాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో కదం తొక్కిన నల్ల సూరీళ్లు నేడు హక్కుల కోసం ఎందుకు పిడికిలి బిగించడం లేదు? గొంతెత్తే ట్రేడ్‌ యూనియన్‌ నేతలు ఎందుకు మూగబోయారు? సింగరేణిలో ఒక్కో ఉద్యోగాన్ని లక్షలకు అమ్ముకున్న దళారులు ఎవ్వరు? వారి వెనుకున్న అధికార నేతలు ఎవ్వరు? ఎన్నడు లేని విధంగా సింగరేణిలో హైటెక్‌ కాపీయింగ్‌ జరిగితే ఆ విచారణ ఏమైంది? క్విడ్‌ ప్రో తో వందల కోట్లు దోచిపెట్టిన ఘనుడు ఎవ్వరు? సింగరేణి ని కేసీఆర్‌ ఫ్యామిలీ కంపెనీ లిమిటెడ్‌ గా మార్చితే ఎర్ర జెండా పార్టీల సంఘాలు ఎందుకు నిశ్శబ్ధంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలు పీపుల్స్‌ మార్చ్‌ యాత్రలో కార్మిక సోదరులు నన్ను కలిసినప్పుడు చర్చలకు రాగా ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియపరచాలనే బాధ్యతతో ఈ లేఖ రాస్తున్నా.


సింగరేణి నూట ముప్పై కు పైగా సంవత్సరాల చరిత్ర. 1885 లో నిజాం కాలంలో బిట్రీష్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ విలియం కింగ్‌ కారేపల్లి మండలం సింగరేణి వద్ద బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. దాంతో బొగ్గు తవ్వకాల కోసం నాటి నిజాం ప్రభువు ఆంగ్లేయులతో ఒప్పందం చేసుకోగా. 1889 లో బొగ్గు తవ్వకాలు ప్రారంభం అయ్యాయి. దక్కన్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో ఉన్న కంపెనీని 1920 డిసెంబర్‌ 23 న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో సింగరేణి ఆవిర్బావం జరిగింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రం 51 శాతం సింగరేణికి దక్కింది. నాడు లక్షా ఇరవై వేల మంది ప్రత్యక్షంగా ఉద్యోగాల్లో ఉంటే లక్షల మందికి పరోక్షంగా సింగరేణి ఉపాధి కల్పించింది. ఖమ్మం జిల్లా ఇల్లందులో మొదలైన సింగరేణి ప్రస్థానం
ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో విస్తరించింది. తెలంగాణ ఆవిర్భావం జరిగే నాటికి 62 వేల మంది ఉద్యోగులు 3 వేల 500 కోట్ల బ్యాంక్‌ డిపాజిట్‌ తో ప్రగతి పధంలో ఉంది సింగరేణి.


కేసీఆర్‌ పాలనలో సింగరేణిని అవినీతి మేఘాలు కమ్మేసాయి. ఉద్యమ సమయంలో ఉద్యోగాలను పణంగా పెట్టి సకలజనుల సమ్మెలో కదం తొక్కారు నల్ల సూరీళ్లు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ గద్దెనెక్కాక సమైక్య రాష్ట్రంలో కూడా లేని విధంగా కార్మికుల హక్కులు కాలరాస్తూ గొంతెత్తే నోళ్లను మూసివేస్తూ కోల్‌ బెల్ట్‌ లో అప్రకటిత ఎమర్జన్సీ కొనసాగుతుంది. నన్ను కలిసిన కార్మికులు కొందరు మాట్లాడుతూ బంగారు తెలంగాణలో బొగ్గు బావులు బొందలు గడ్డలు కానివ్వం అన్న కేసీఆర్‌ మా బతుకులపై మన్ను పోస్తుండు, కేసీఆర్‌ ఏ స్థాయి నియంతో చెప్పాలంటే ఒక్క ఉదాహరణ గా ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిలుస్తాయి. గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా ట్రేడ్‌ యూనియన్లను గడ్డి పోచలా మార్చిండు.నాడు సకల జనుల సమ్మెలో మీ అంత గొప్పోళ్లు లేరన్న కేసీఆర్‌ నేడు కనీసం కార్మిక నేతలకు కలిసే టైం ఇవ్వని దుస్థితి. కేసీఆర్‌ కుమార్తె కవిత తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా 2017 లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో జనరల్‌ ఎలక్షన్‌ మాదిరి కోల్‌ బెల్ట్‌ ఎన్నికలను కరెన్సీ నోట్లతో ప్రభావితం చేసి కలుషితం చేసారని కార్మిక సంఘాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకొని, కార్మికుల హక్కుల కోసం మాట్లాడే వారు లేకుండా సింగరేణి కల్వకుంట్ల కుటుంబం లిమిటెడ్‌ కంపెనీ గా మార్చారని కార్మికులు నాతో అంటుంటే హక్కుల కోసం నిత్యం పోరాడీ ఎర్రజెండా పార్టీలు కేసీఆర్‌ పక్కన చేరితే ఇక కార్మికులకు దిక్కెవరు అని టీబీజీకెఎస్‌ నేతలే ఆవేదన వ్యక్తం చేస్తూ సింగరేణి బతకాలంటే ఐ.ఎన్‌.టీ.యూసీ నిలబడాలని వారే కోరుతున్నారంటే కేసీఆర్‌ హయంలో సింగరేణిలో కార్మికుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవోచ్చు.

======================

సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌

Related Articles

Latest Articles

Optimized by Optimole