Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై అతి త్వరలో వరంగల్ లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు.కరీంనగర్ జైలు నుండి విడుదలైన అనంతరం మొదటిసారిగా మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పదవ తరగతి తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారని? హిందీ పేపర్ ను లీక్ చేయాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. టెక్నాలజీలో మేమే తోపని చెప్పేటోళ్లు లీకేజీ కుట్రను ఎందుకు చేధించడం లేదని? నిలదీశారు. దమ్ముంటే పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వాట్సప్ లో పేపర్ ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధమని? వరంగల్ కమిషనర్ కు తెలివి ఉందా?.. చేతగానతనాన్ని మాపై నెడతారా? కమీషనర్ … మీ సంగతి తేలుస్తామంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు.ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎంపీ పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పరు… నోటీసులివ్వరు.. పోలీసుల తీరుతో పోలీసులు తలదించుకునే దుస్థితి నెలకొందని బీజేపీ స్టేట్ చీఫ్ వాపోయారు.పేపర్ లీకుతో నాకు సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా… నేను కుట్ర చేసినట్లు ప్రమాణం చేసే దమ్ము సీపీకి ఉందాని సంజయ్ సవాల్ విసిరారు.
కాగా ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని తెలిసి రెచ్చగొట్టేందుకే కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకే ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, అరాచక పాలనపై ద్రుష్టి మళ్లించేందుకు రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధానిని అడ్డుకోవాలనే కేసీఆర్ కుటుంబ కుట్రలను ప్రజలంతా తిప్పికొట్టాలని సంజయ్ పిలుపునిచ్చారు.