Janasena:
* ఎన్నికల సమరానికి ప్రణాళికతో సిద్ధమవుదాం
* గాజువాక నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రజా వ్యతిరేక పాలన నిర్ణయాలను జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సుపరిపాలన అనేది వైసీపీకి తెలియదన్నారు. అరాచకాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో విపరీతమైన కోపం ఉందని.. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు.కలసికట్టుగా పని చేస్తే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యమని తేల్చిచెప్పారు. వైసీపీ ప్రభుత్వ పాలన మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు ఇవ్వకుండా జన సైనికులు, వీర మహిళలు కలసి పని చేయాలని సూచించారు.
కాగా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో బలం పుంజుకుందన్నారు మనోహర్. ప్రజా సమస్యల పరిష్కారంలో మనం ముందున్నామన్నారు. కష్టాల్లో ఉన్న పేదలకు పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారని గుర్తు చేశారు. ప్రతి కష్టంలోనూ ప్రజలకు జనసేన పార్టీ అండగా నిలబడిందన్నారు. వీటిని ప్రతి ఒక్కరికి తెలియ చెప్పాల్సిన బాధ్యత జనసైనికులు, వీర మహిళలపై ఉందని మనోహర్ స్పష్టం చేశారు.