తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలు చూసి అలవాటైపోయింది: సంజయ్

BJPTelangana:తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని మీరు టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు… ఆ నిప్పు లేదు.. పొగ లేదు.. ఇదంతా కేసీఆర్ లాంటి మూర్ఖుడు చేస్తున్న కుట్ర.  సొంత పార్టీ సంగతిని పక్కన పెట్టి పక్క పార్టీల్లో పొగపెట్టాలని చూస్తున్నరు. మా కార్యకర్తలెవరూ వీటిని పట్టించుకోవడం లేదని సంజయ్ తేల్చిచెప్పారు.  ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రేల్వే స్టేషన్ కు చేరుకున్న ‘‘విస్తారక్’’ లకు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, సహా పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ బూత్ ల వారీగా బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా అల్పకాలిక విస్తారక్ లను నియమించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి 650 మంది విస్తారక్ లు ఈరోజు తెలంగాణకు వచ్చారు. వీరికి సికింద్రాబాద్ తోపాటు మంచిర్యాల, ఖాజీపేట స్టేషన్లలో స్వాగతం పలికి అన్ని మండలాలకు పంపిస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పూర్తితో వీరంతా తెలంగాణలోని  మండలాల వారీగా పర్యటించి పోలింగ్ బూత్ ల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమవుతారని అన్నారు.

ఇక ఈటల రాజేందర్ పై హత్యకు కుట్ర, భద్రతపై మీడియా అడిగిన ప్రశ్నకు సంజయ్ బదులిస్తూ…. ఆయనపై హత్యకు కుట్ర చేసిన వారిపై తక్షణమే విచారణ జరపడంతోపాటు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు.  గతంలో మాపై దాడులు చేసిన వాళ్లను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టి ఉల్టా మమ్ముల్నే జైల్లో పెట్టారని గుర్తుచేశారు. ఇప్పటికైనా దోషులను, అనుమానితులను అరెస్ట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలని.. అదే సమయంలో ఈటల రాజేందర్ కు కచ్చితంగా తగిన భద్రత కల్పించాల్సిందేనని సంజయ్ డిమాండ్ చేశారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole