Nancharaiah merugumala senior journalist: కాపు కులాలకు సామాజిక న్యాయం పేరుతో రాజకీయ ప్రయోజనాలు సాధిస్తున్న కాపు నేతలు! ఆధిపత్య ధోరణి వదిలితే విశాల కాపు సముదాయం బీసీల మద్దతు కూడగట్టే అవకాశం లేకపోలేదు!
‘‘కాపు సముదాయం తనకున్న ఆధిపత్య హోదా, ధోరణి కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మిగిలిన అన్ని కులాల ప్రజలకూ దూరమైంది. ఇలా ఇతర సామాజికవర్గాలన్నింటీనీ శత్రువులుగా చేసుకున్నారు కాపులు. కాపు నేతల నాయకత్వంలో పుట్టుకొచ్చిన రాజకీయపక్షాలు ఎన్నికల్లో విఫలమవడానికి ఇదే కారణం,’’ అని కలకత్తాలోని ప్రసిద్ధ సామాజికశాస్త్రాల పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ స్టడీస్ (సీఎస్సెస్ ఎస్సెస్)లో అసోసియేట్ ప్రొఫెసర్ చెన్నూరి సతీష్ అభిప్రాయపడ్డారు. కాపుల రాజకీయ సమీకరణపై డాక్టరేట్ చేసిన సతీష్ ఇంకా ఏమన్నారంటే–‘గోదావరి ప్రాంతంలో కాపులకు బీసీలు వ్యతిరేకం. కాపుల ఆధిపత్యాన్ని షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) అంగీకరించరు. క్షత్రియులైతే కాపులకు దూరంగా ఉంటారు,’ అని కుండబద్దలు కొట్టారు. కాపుల రాజకీయ పోరాటాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆరాటాలపై సమగ్ర అధ్యయనం చేసిన సతీష్ గారి అభిప్రాయాలతో ఏకీభవించే కాపు మేధావులు, ఇతర కులాలకు చెందిన ఆలోచనాపరులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండకపోవచ్చు. అయితే, 1980ల ఆరంభంలో–తెలుగుదేశం పార్టీ స్థాపనకు సంప్రదింపులు జరుగుతున్న కాలంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంఘం పేరుతో కాపు జన సమూహాలను సమీకరించడానికి ప్రయత్నాలు తొలుత గోదావరి జిల్లాల్లోనే జరిగాయి. కాంగ్రెస్ వెలుపల ఉన్న కాపులందరినీ కొత్త రాజకీయ శక్తి తెలుగుదేశంలోకి పోకుండా నిరోధించడానికి కాపునాడు పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆశీస్సులతో కాపు రాజకీయ సమీకరణకు బ్రాహ్మాండమైన ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. కాపులను రాజకీయంగా మరింత మేల్కొలిపే ఈ బృహత్ కార్యక్రమానికి నాటి కాంగ్రెస్ మంత్రి సంగిత వెంకట రెడ్డి గారు గట్టిగా నిలబడ్డారు. ఆయన తూర్పు గోదావరిలోని నాటి ఆలమూరు నుంచి 1978లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
కాపులకు బీసీ హాదా డిమాండు కాపులకు మేలే చేసిందా?
ఈ కాపునాడు సమీకరణలో భాగంగా కాపు కులాలను వెనుకబడిన తరగతుల్లో (బీసీలు) చేర్చాలని, తద్వారా వారికి బీసీ కోటా ఇవ్వాలనే నినాదం ముందుకు తెచ్చారు కొందరు కాపు రాజకీయ దురంధరులు. అంతేగాని, కాపులకు రాజ్యాధికారం ఇవ్వాలనే సామాన్య కాపు జనాలకు అర్ధం కాని మాటలు ఎవరూ మాట్లాడలేదు. అయితే, 1983 జనవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగిత వెంకటరెడ్డి గారే స్వయంగా ఆలమూరులో ఓడిపోయారు. జనతాపార్టీ, టీడీపీ, కాంగ్రెస్ తరఫున పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రి అయిన ముద్రగడ పద్మనాభం గారు కాపులకు బీసీ హోదా కోసం తర్వాత అనేకసార్లు ఉద్యమించారు. చివరికి మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి నాయకత్వంలో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఏర్పాటు చేయడానికి ముందస్తు కార్యక్రమంగా 2008లో కాపు మేధావులు కూడా కాపులకు బీసీ కోటా కావాలంటూ అక్కడక్కడా సమావేశాలు నిర్వహించారు. అసలు చిరంజీవి గారు పార్టీ పెట్టేది కేవలం కాపు కులాలకు బీసీ రిజర్వేషన్లు ఇప్పించడానికేనా? అనే అనుమానం బీసీలు, ఇతర కులాల్లో వచ్చేలా ఈ హడావుడి కొనసాగింది. ఈ ఆర్భాటం వల్ల కాపులకు అసలు కావాల్సింది–బీసీ హోదాయా? రాజ్యాధికారమా? అనే విషయంపై కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం జనంలోనే అయోమయం నెలకొంది. రాజకీయ సమీకరణ కేవలం బీసీ హోదా కోసమే అనే రీతిలో కాపు నేతలు ప్రవర్తించారు. మొదట కాపు రిజర్వేషన్లకు, వారికి బీసీ హోదాకు వ్యతిరేకంగా మాట్లాడిన బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య గారిని నాటి కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గారి చొరవతో కాపులకు బీసీ హోదాకు తనకు అభ్యంతరం లేదనే రీతిలో మాట్లాడేలా చేయగలిగారు. మొత్తం మీద ముఖ్యమంత్రి పదవి ఇప్పటి వరకూ దక్కకపోయినా గాని తెలుగునాట రెండు ప్రధాన ఆధిపత్య వ్యవసాయ కులాలైన రెడ్లు, కమ్మల కన్నా వార్తల్లో ఎక్కువగా ఎలా నిలవాలో కాపు జనసందోహాలు తెలుసుకున్నాయి. ఆ మేరకు రాజకీయంగా లబ్ధిపొందుతున్నాయి. రాష్ట్రంలో ఒక దాని తర్వాత ఒకటి అధికారం సంపాదించే రెండు ప్రధాన కులాలతో గట్టిగా బేరమాడుతూ నిరంతరం తమ డిమాండ్లు నెరవేర్చుకునే పోరాట పటిమను, లౌక్యాన్ని కాపు నాయకులు, కార్యకర్తలు సంపాదించగలిగారు. జనసేన నేత కొణిదెల పవన్ కల్యాణ్ కాకినాడ నగర ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై విమర్శల వర్షం కురిపిస్తే వెంటనే కాపునాడు నేత ముద్రగడ గారు ద్వారంపూడి కుటుంబానికి వత్తాసుగా మాట్లాడడం నేటి కాపు మహానేతల రాజకీయ పరిపక్వతకు, తెలివితేటలకు అద్దంపడుతోంది. మిగిలిన అగ్రకులాల మాదిరిగానే అన్ని పార్టీల్లో కీలక స్థానాల్లో ఉంటూ తమ జాతి ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలో కాపులు చక్కగా నేర్చుకున్నారు. ఇదే ఆనవాయితీ కొనసాగితే ఏపీలో ఆరేడు శాతం జనం ఉన్న కాపు సముదాయం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు. అప్పుడు గోదావరి నది ప్రశాంతంగా బంగాళాఖాతంలోకి ప్రవహిస్తుంది. పులస చేపలు లక్షలాది సంఖ్యలో ఎదురొస్తాయి.