Janasena: వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని వైసీపీ భావిస్తోందని.. ఎలాగైనా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోందని ఆయన అభిప్రాయడ్డారు. వచ్చే ఎన్నికల్లో అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రమని అన్నారు.గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో..వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పద్ధతి అవలంబించి లబ్ది పొందాలని వైసీపీ చూస్తోందని హెచ్చరించారు. సోమవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మాట్లాడుతూ.. ‘‘జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, తెలుగుదేశం పార్టీ పిలుపునచ్చిన బంద్ లో జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్నారని అన్నారు. అయితే కొన్ని చోట్ల జనసేన నాయకులపై పోలీసులు వ్యహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని కొన్ని ప్రాంతాల్లో కనీసం జనసేన జెండా కూడా పట్టుకోనివ్వలేదని..గుంటూరు నగరంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ లను అన్యాయంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని తెలిపారు. అదే నగరంలో మేయర్, ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు, స్వచ్ఛందంగా దుకాణాలు మూస్తే బలవంతంగా తెరిపించేందుకు ఒత్తిడి చేయడం చూశామని.. మరి అధికార వైసీపీ కి చట్టం వర్తించదా? అని మనోహర్ ప్రశ్నించారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు ..
రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ప్రజలంతా సమష్టిగా తిరుగుబాటు చేయాలన్నారు మనోహర్. అక్రమ కేసులకు భయపడేది లేదని…ఏది తల్చుకుంటే అది అయిపోవాలి అనే స్వభావం ఉండే జగన్ కచ్చితంగా పదవి నుంచి త్వరలోనే దిగిపోతాడని ఆయన జోస్యం చెప్పారు. ప్రజలంతా ఇప్పటికే జగన్ ను గద్దె దింపాలనే నిర్ణయానికి వచ్చారని.. అది అర్ధమై వైసీపీ నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విశాఖపట్నంలో జనవాణి నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినపుడు 3 రోజుల పాటు పోలీసులు హోటల్ నుంచి బయటకు రాకుండా ఆయనతో పాటు నాయకులను నిర్భందించారని.. ఆ సమయంలో నారా చంద్రబాబునాయుడు సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వ కోణంలోనూ చూడాలని నాదెండ్ల సూచించారు.