‘పంచ’ దంపతులు..!!


ఈప్రపంచంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళ మనస్వత్వాలు మాత్రం భిన్నమైనవి. వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారని శాస్త్రం చెబుతున్న మాట! ప్రపంచంలో ఉన్న ఆ ఐదు జంటలు ఎవరంటే?

1. మొదటిది లక్ష్మీనారాయణులు
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి,
అక్కడే లక్ష్మి ఉంటుంది,
అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.

2.రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం
తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు.
రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,
ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

3. మూడవది బ్రహ్మ సరస్వతుల జంట.
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం,
దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.
ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ..ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

4 . నాల్గవది ఛాయా సూర్యులు.
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు,
అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు.అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా. కోపంగా ,పట్టుదలతో ఉంటాడో. ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

5. ఐదవది రోహిణీ చంద్రులు
రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది.
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి,లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

Optimized by Optimole