బొత్స గారూ… టోఫెల్ టోపీ నిజమేనండీ :నాదెండ్ల మనోహర్

APpolitics: వైసీపీ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకురావాలని చూస్తున్న టోఫెల్ పరీక్ష అమలు తీరు, దాని కోసం అనవసరంగా వేల కోట్ల ప్రజాధనం వృథా చేయాలని చూస్తున్న తీరుపై జనసేన పార్టీ తరఫున తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ఈ అంశంపై అన్ని వివరాలతో మాట్లాడినట్లు.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రాష్ట్ర ప్రభుత్వం టోఫెల్ పరీక్షను అమలు చేయడానికి ఈటీఎస్ సంస్థతో చేసుకున్న 54 పేజీల పూర్తి ఒప్పందాన్ని చదివి, విషయాన్ని అధ్యయనం చేసి వస్తే చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందంలో పేర్కొన్న ప్రతి పేరా, క్లాజుపై చర్చించేందుకు, దీనిలో ప్రభుత్వ అసమర్ధత, ప్రజాధనం దుర్వినియోగంపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామ’ని మనోహర్  సవాల్ విసిరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ ప్రతి అంశం మీదా స్పందించే ముందు నిజానిజాలు తెలుసుకొని, పూర్తి ఆధారాలతో మాట్లాడుతుందన్నారు మనోహర్. కేవలం సమస్య గురించి మాట్లాడటమే కాకుండా, దానికి పరిష్కార మార్గాలను చూపేలా మాట్లాడటం అనేది పవన్ కళ్యాణ్  పార్టీ శ్రేణులకు సూచించిన మార్గమని తేల్చిచెప్పారు. దానికి అనుగుణంగానే జనసేన పార్టీ ప్రజోపయోగ విషయాల మీద స్పందిస్తుందన్నారు. ప్రజాధనం వృథా, అవినీతి అంశాలను బయటపెడుతుందన్నారు. విపక్ష పార్టీగా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాల మీద ప్రశ్నించే బాధ్యత తమపై ఉందన్నారు. జరుగుతున్న పొరపాట్ల మీద ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి తాము తప్పక మాట్లాడుతామని వివరించారు.

లొసుగులమయం టోఫెల్ ఒప్పందం ..

విద్యా శాఖలో సంస్కరణల పేరుతో, పేద విద్యార్థులకు మేలు చేస్తున్నామన్న పేరుతో వైసీపీ ప్రభుత్వం 2024 నుంచి 2027 వరకు తీసుకురావాలని భావిస్తున్న టోఫెల్ పరీక్ష విధానంలోని లొసుగుల గురించి తాము మాట్లాడామన్నారు మనోహర్. దీనిలో ఎంత మేర ప్రజాధనం వృథా అవుతుందనేది లెక్కలతో వివరించామన్నారు. అయితే దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆధారాలు లేకుండా మాట్లాడుతోందని, పూర్తిగా అవగతం చేసుకొని మాట్లాడాలని చెప్పారని.. తాము అన్నీ పరిశీలించి.. అధ్యయనం చేసిన తర్వాతే మాట్లాడతామనేది మంత్రి గారు తెలుసుకోవాలని హితువు పలికారు. 3 రోజుల క్రితం టోఫెల్ పరీక్ష కోసం ఈ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి తెలిసిన వివరాలను ప్రజల ముందు తెలియజేశామని నాదెండ్ల తెలిపారు. ఎలాంటి ప్రయోజనం లేని పరీక్ష కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టడం సబబు కాదని చెప్పామని.. దీనిపై సరైన సమాధానం చెప్పలేక, సరిదిద్దుకునే శ్రద్ధ లేక సీనియర్ మంత్రి  బొత్స.. జనసేన మీద ఇష్టానుసారం మాట్లాడారని మండిపడ్డారు. దీనిపై పూర్తి ఆధారాలను ప్రజల ముందుపెడుతున్నామని నాదెండ్ల చెప్పుకొచ్చారు.

 

Optimized by Optimole