కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?

Nancharaiah merugumala senior journalist:( కాంగ్రెస్‌ హైకమాండ్‌–రఘువీరారెడ్డికి ఏమిచ్చింది? పొన్నాల లక్ష్మయ్యను ఎక్కడికి పంపిస్తోంది?రేవంత్‌ రెడ్డికి బీసీలు, ‘మున్నూరు’ నేతలంటే ‘పెరుగుతున్న’ భయమే ఇందాకా తెచ్చిందా?

====================

తొమ్మిదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ పొన్నాల లక్ష్మయ్య గారు. వయసులో 13 ఏళ్లు తేడా ఉన్నా ఫిబ్రవరి రెండో వారంలోనే పుట్టారు ఈ బీసీ–డీ కాంగ్రెస్‌ నాయకులు. మరో పోలిక ఏమంటే ఇద్దరు పీసీసీ నేతలూ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2014, 2018, 19) ఓడిపోయారు. కొంత కాలం నీలకంఠాపురంలోని ఇంటికి, పొలం పనులకే పరిమితమై, రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న రఘువీరారెడ్డి భారత జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని పాదయాత్రలో నడిరోడ్డు మీద కలుసుకుని మళ్లీ వార్తల్లోకి వచ్చారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు విస్తృత ప్రచారం చేశారు అనంతపురం యాదవ కుటుంబంలో పుట్టిన రఘువీరా. కర్ణాటక సరిహద్దు గ్రామ నివాసి కావడంతో ఆయనకు కన్నడం బాగా వచ్చు. అదీగాక మైసూరు వంటి నగరాల్లో ఆయనకు ఆదాయం ఇచ్చే ఆస్తులున్నాయి. మొత్తానికి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం రఘవీరాను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి పార్టీ అధ్యక్షుడు, కర్ణాటక దళిత నేత ఎం.మల్లికార్జున ఖర్గే నామినేట్‌ చేయడానికి దారితీసింది. అనేక మంది రాయలసీమ కాంగ్రెస్‌ నేతలు, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి బీసీ–డీ వర్గం నేతల మాదరిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఇష్టపడని 66 ఏళ్ల రఘువీరాకు కాంగ్రెస్‌ అధిష్ఠానం, నెహ్రూ–గాంధీ పరివారం ఇన్నాళ్లకు న్యాయం చేశాయని అంటున్నారు.

 

మున్నూరు కాపు రత్నం పొన్నాల లక్ష్మయ్య గారికి అంత అదృష్టం లేదు..

ముందే చెప్పుకున్నట్టు తెలంగాణ సకల ప్రజానీకం ప్రజాస్వామిక నిజమై, నూతన రాష్ట్రం అవతరించిన సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల గారు మాత్రం దురదృష్టవంతుడనే చెప్పాలి. ఇప్పుడు 79 ఏళ్లు దాటి 80 వైపు పరుగులు తీస్తున్న ‘యూత్‌ ఫుల్‌’ లక్ష్మయ్య గారు తెలంగాణ ఇచ్చిన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఓడిపోవడం జనగామలో ఒక విషాదం. అంగేకాదు, ప్రత్యేక తెలంగాణను తెలివిగా దిల్లీకి పోయి పట్టుకొచ్చిన పద్మనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు గారి టీఆరెస్‌ చేతుల్లో ఈ జాతీయపక్షం ఘోరంగా ఓడిపోవడం కాంగ్రెసోళ్లకు పదేళ్ల వరకూ కోలుకోలేని ట్రాజిడీ. నాలుగున్నరేళ్ల తర్వాత 2018 చలికాలంలో జరిగిన తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి పొన్నాల ఓడిపోయారు. అంతకు ముందు తన కోడలు వైశాలీ రెడ్డికి ఒక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ టికెట్‌ ఇప్పించి పోటీకి దింపితే ఆమె గెలవలేకపోవడం ఆయన కుటుంబానికి చిన్న దెబ్బే. మరి మూడుసార్లు (1989,1999, 2004, 2009) జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కొన్నిసార్లు మంత్రిగా పనిచేసిన పూర్వపు పౌల్ట్రీ వ్యాపారి పొన్నాల గారికి 2023 డిసెంబర్‌ తెలంగాణ ఎన్నికల్లో జనగామ టికెట్‌ దక్కని పరిస్థితి రావడం నిజంగా ఊహించని పరిణామం. తెలంగాణ ఉద్యమాల కాలంలో, తెలంగాణ ఇచ్చే సమయంలో ఏమాటకు ఆమాట తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పెద్దగా నాటకాలు ఆడలేదు. అదే–కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెస్‌ నేతలతో ముఖ్యంగా ఉండవల్లి అరుణకుమార్, లగడపాటి రాజగోపాల్‌ వంటి నోరు, పైసలతోపాటు జిత్తులమార్లుగా పేరున్న పార్లమెంటు సభ్యులతో చక్కటి రికార్డింగ్‌ డాన్సులు ఆడించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఇలాంటి కాంగ్రెసోళ్లతో గజ నాటకాలు ఆడించినందుకు 2014, 2019 ఎన్నికల్లో హస్తంపార్టీకి మంచి దెబ్బే వేశారు ఆంధ్రా జనం. బుర్ర ఎక్కువ ఆంధ్రోళ్లను దద్దమ్మలను చేయడానికి చేసిన కాంగ్రెస్‌ కుయుక్తులు ఇలా ఫెయిలయ్యాయి. కాని, పొన్నాల లక్ష్మయ్య వంటి అమెరికా యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువు, డబ్బున్న బీసీ నేతను కాంగ్రెస్‌ పక్కకు లాగేయడం తెలంగాణ ప్రజలకు బాధాకరమే అంటున్నారు. కోస్తా, రాయలసీమతో పోల్చితే–హైదరాబాద్‌ సహా తెలంగాణ బీసీ కాంగ్రెస్‌ నేతలు చురుకైన మెదళ్లు ఉన్నోళ్లనే పేరుండేది. ముఖ్యంగా మున్నూరు కాపుల పొలిటికల్‌ డైనమిజం అందరికీ తెలిసిందే. తెలంగాణ బీసీలకు వెన్నెముక వంటివారు మున్నూరు కాపులు అయితే, గౌడలు, గొల్లలు పక్కటెముకలు, పద్మశాలీలు, పెరికలు వంటి ఇతర ప్రముఖ కులాలు ఇతర కీలక ఎముకలని నా తెలంగాణ బీసీ మిత్రుడొకరు అన్న మాటల్లో నిజం లేకపోలేదనిపిస్తోంది. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారి దాదాపు డజను మందికి పైగా మున్నూరు కాపు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మరో పక్క మరో జాతీయపక్షం బీజేపీ కూడా తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ బాటలోనే నడుస్తూ దూకుడుగా పార్టీ శాఖను నడిపిన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ను తొలగించి కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డికి నాయకత్వం అప్పగించింది. కోస్తా, సీమ జిల్లాల కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సముదాయంతో పోల్చితే అన్ని విధాలా పదునైన దిమాగులున్న మున్నూరు కాపులను కాంగ్రెస్, బీజేపీలు ఇలా విస్మరిస్తే– కేసీఆర్‌ ఈసారి శీతాకాలం ఎన్నికల్లో తన బీఆరెస్‌ ను మొదటిసారి విజయపథంలో నడిపించి మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఖాయమనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా రాయలసీమ నేతలను ఎలా చూస్తుంది? తెలంగాణ నాయకులను ఎలా పక్కనపెడుతుంది? అనడానికి రఘువీరారెడ్డి, లక్ష్మయ్య గార్ల రాజకీయ జీవితాలే గొప్ప తార్కాణం.