SoniaGandhi:ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న సోనియా!

Nancharaiah merugumala senior journalist:

ఇందిర రాజ్యసభకు ఎన్నికైన దాదాపు 60 ఏళ్లకు అదే సభలో అడుగుబెడుతున్న ఆమె పెద్ద కోడలు సోనియా! పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్‌ భవిష్యత్తుకు చక్కటి సూచిక ఇదేనేమో?

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికైంది ఇప్పటికి దాదాపు 60 ఏళ్ల క్రితం. తండ్రి పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ మరణించిన మూడు నెలలకు 1964 ఆగస్టులో వారి కుటుంబ ‘సొంత రాష్ట్రం’ ఉత్తరప్రదేశ్‌ నుంచి ఇందిరమ్మను రాజ్యసభకు కాంగ్రెస్‌ టికెట్‌ పై ఎన్నికయ్యే పని పూర్తి చేశారు నాటి కాంగ్రెస్‌ ప్రధాని లాల్‌ బహాదుర్‌ శాస్త్రీ. అప్పుడు నెహ్రూ జీ ఏకైక సంతానం వయసు 47 ఏళ్లకు దగ్గర్లో ఉంది. రాజ్యసభకు ఎన్నికైన వెంటనే ఎందుకైనా మంచిదని ఇందిరమ్మను కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రిని చేశారు పొట్టివాడైనా గట్టివాడని నిరూపించుకున్న భారత ఏకైక కాయస్థ ప్రధాని శాస్త్రీజీ. శాస్త్రీ జీ మరణానంతరం ఇందిరా ప్రియదర్శిని 1966 జనవరి చివర్లో ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. ఇలా రాజ్యసభ ఎంపీగానే ప్రధాని అయిన తొలి నేతగా ఇందిర చరిత్రకెక్కారు. ఏడాది తర్వాత జరిగిన 1967 ఫిబ్రవరి ఎన్నికల వరకూ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఇందిర అదే మాసంలో లోక్‌ సభకు తొలిసారి ఎన్నికవ్వడమేగాక రెండోసారి ప్రధాని అయ్యారు. మళ్లీ నెహ్రూ–గాంధీ (ఇందిరాగాంధీ ఫ్యామిలీ) కుటుంబ సభ్యులు రాజ్యసభకు సోనియాగాంధీ ఎన్నికతో రెండోసారి అవుతుంది. ఇందిరమ్మ తాను పుట్టిన యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా, ఆమె కోడలు సోనియా జీ ఇప్పుడు యూపీ సరిహద్దు (ధోల్‌ పూర్‌ దగ్గర కొద్దిపాటి సరిహద్దు ఉంది, దిల్లీకి రైల్లో పోతే రాజస్థాన్‌ లోని ధోల్‌ పూర్‌ స్టేష¯Œ  వస్తుంది) రాష్ట్రం రాజస్తాన్‌ నుంచి ఎన్నికయ్యే పని బుధవారం ఆరంభిస్తున్నారు. ఇందిరమ్మ తర్వాత రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఉన్న జనతాదళ్‌ నేతలు ఎచ్‌డీ దేవెగౌడ, ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌. కాంగ్రెస్‌ నేత డా.మన్మోహన్‌ సింగ్‌ కోహ్లీ జీ. ఈ ముగ్గురిలో దేవెగౌడ ఒక్కరే ప్రధానిగా ప్రమాణం చేశాక రాజ్యసభకు తన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఎన్నికయ్యారు. మొత్తంమీద ఇందిర పార్లమెంటు ఎగువ సభకు దాదాపు 47 ఏళ్ల వయసులో ఎన్నికైతే, ఆమె ఇటలీ కోడలు ఆంటోనియో మైనో ఉరఫ్‌ సోనియా గాంధీ 77 ఏళ్లు దాటినాక భారత పార్లమెంటు ఎగువ సభకు (హౌసాఫ్‌ స్టేట్స్‌ లేదా రాజ్యసభ) ఎన్నికవబోతుండడం విచిత్రంగా లేదా? ఇందిర–రాజీవ్‌ కుటుంబ వారసులు ఒకరు (‘తెలంగాణ తల్లి’ సోనియమ్మ) లోక్‌ సభ 18వ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు సురక్షితమైన రాజస్తాన్‌ రాజ్యసభ రూటులో భారత కొత్త పార్లమెంటు భవనంలోకి రెండోసారి అడుగుబెట్టాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ భవితవ్యానికి, యువ వారసులు ప్రియాంక, రాహుల్‌ రాజకీయ భవిష్యత్తుకు చక్కటి సూచిక.

(ఎమర్జెన్సీ తర్వాత జరిగిన 1977 లోక్ సభ రాన్నికల్లో ఇందిరా ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలో బంధువులతో అత్తాకోడళ్లు ఇందిర, సోనియా)

Related Articles

Latest Articles

Optimized by Optimole