విశీ: ఆ మధ్య కాలంలో ఒక రచయిత్రి ఒక కథ రాశారు. ఆ కథ పేరు నన్ను బాగా ఆకర్షించింది. కథ చదవకపోయినా ఆ పేరే చాలా కొత్తగా అనిపించి బాగా గుర్తుండిపోయింది. అదే పేరుతో ఆ రచయిత్రి కథల పుస్తకం కూడా వేశారు. ఆమెతో నాకు పరిచయం లేదు. ఎక్కడుంటారో తెలియదు. ఆ పుస్తకం ఎలా తెప్పించుకోవాలా అని చాన్నాళ్ల నుంచి అనుకుంటూ ఉన్నాను. మొన్న బుక్ ఫెయిర్‌కి వెళ్లినప్పుడు ఆ పుస్తకం చూశాను. మళ్లీ వెళ్తాను కదా, అప్పుడు కొందాం అని వచ్చేశాను.
ఆమె రాసిన ఆ కథ కాపీ నా దగ్గర ఉంది. ఇందాక తీసి చదివితే నా ఉత్సాహం మొత్తం నీరుగారిపోయింది. నన్ను ఆకర్షించిన ఆ టైటిల్‌కీ, కథకీ సంబంధమే కనిపించలేదు. ఎక్కడో మొదలైన కథ మరెక్కడో తిరిగి, ఉన్నట్టుండి ఆగిపోయింది. కథాంశం గొప్పగా ఉన్నా కథ నడిపిన తీరు చాలా అవకతవకగా ఉంది. పైగా ఆ కథ నిండా అచ్చుతప్పులు. ప్రతి మూడు వాక్యాలకో అక్షరదోషం. నిండా అన్వయదోషాలు. కథ ఎవరి గురించి ఎవరు చెప్తున్నారో కూడా తెలియనంతగా ఎలాగెలాగో రాశారు. ఆ కథ ప్రచురించిన పత్రిక చాలా ప్రతిష్టాత్మకమైనదే! అయినా అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు.
అక్షర దోషాలు, అన్వయ దోషాలు కాసేపు పక్కన పెడదాం! ఆ పత్రికకు ఎడిటర్ ఉన్నారు. చాలా సీనియర్. అలాంటాయన ఈ ఇమ్మెచ్యూర్ కథను వేయడం, ఆ దోషాలను యథావిధిగా ఉంచి వేయడం ఏమిటో అర్థం కాలేదు. “అమ్మా! కథ బాగా రాశావ్! ఇంకా బాగా రాయొచ్చు! ప్రయత్నం చేయ్! మంచి కథగా మారాక వేద్దాం” అని చెప్పొచ్చు కదా! టైటిల్ బాగుంది, టైం కుదిరింది అని వేయడం ఏమిటో.. చాలా విచిత్రంగా ఉంది. పైగా అలాంటి కథ పేరిట పుస్తకం వస్తున్నప్పుడు ఆ కథ మీద మరింత శ్రద్ధ అవసరం కదా!
మంచి కథ అయ్యే అంశాన్ని రచయిత సరిగా డీల్ చేయనప్పుడు, మరింత బాగా రాసే అవకాశం ఉన్నప్పుడు ఎడిటర్లు వారికేమీ సలహా ఇవ్వరా? కథని మరింత మెరుగు చేసేలా సలహాలు అందించరా? కథ ఎలా ఉంటే అలా వేయడమే సరైన పద్ధతా? రచయితలు రాసిన దాంట్లో అక్షరం తీసేసినా పాపం అని ఫీలవుతారా? ఎడిటింగ్ కోసం నా దాకా వచ్చిన కథలకైతే తప్పకుండా చర్చ చేస్తాను. పట్టి పట్టి చూస్తాను. నాకు తోచిన సూచనలు చెప్తాను. రచయితలు వాటిని పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా సమస్య లేదు. వారి అనుమతితోనే మార్పులు చేస్తాను. అదే సరైన పద్ధతి అనుకుంటాను. నేను రాసే కథల విషయంలోనూ అదే పాటిస్తాను.
PS: నేను చదివిన కథలోని శైలి ఎలా ఉన్నా, టైటిల్ మాత్రం చాలా బాగుంటుంది. అలాంటి టైటిల్ పెట్టినందుకు ఆ రచయిత్రి మీద నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఆమె రాసిన మిగిలిన కథలు ఎలా ఉన్నాయో చూడాలి మరి!
–