Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నాల్గో రోజు దిగ్విజయంగా పూర్తయింది. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంతో పాటు సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో యాత్ర సాగింది. యాత్రకు అడుగడుగునా జననీరాజనం పట్టారు. వీర్నపల్లి మండలంలో పెద్ద ఎత్తున గిరిజనులు తరలివచ్చి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కోనరావుపేట మండలంలో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి సంజయ్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్లారెడ్డిపేటలో బీజేపీ శ్రేణులు సంజయ్ తోపాటు అడుగులో అడుగు వేసుకుంటూ పాదయాత్ర చేశారు.
మరోవైపు ప్రజాహిత యాత్రలో ఈరోజు మొత్తం 19 గ్రామాల్లో పాదయాత్ర చేశారు. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. వివిధ గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి సంజయ్ ఆర్థిక సహాయం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. అసెంబ్లీ టైం వృధా చేస్తూ ” కృష్ణాజలాలు అంటూ బీఆర్ఎస్ .. మేడిగడ్డ సందర్శన అంటూ” కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామాలను బట్టబయలు చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావాలంటే మరోసారి తనను ఎంపిగా గెలిపించాలని ప్రజలను సంజయ్ అభ్యర్ధించారు.
ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంజయ్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి మహిళలూ, యువత ఇళ్ల ముందు వేచి చూశారు.ఆయన రాగానే కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు. భారత్ మాతాకీ జై..జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేశారు.
ఆయా గ్రామాల్లోని చిరు వ్యాపారులను, చేతి వృత్తి వారిని నేరుగా కలిసి యోగ క్షేమాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజలు వినతి పత్రం రూపంలో ఇచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సంజయ్ వారికి భరోసా కల్పించారు.
అటు యాత్రలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంజయ్ నిప్పులు చెరిగారు.అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నాయని దుయ్యబట్టారు. కృష్ణా నీటిపై బీఆర్ఎస్ సభలు పెట్టి డ్రామాలాడుతోంది. కాళేశ్వరం వెళ్లి కాంగ్రెస్ నాటకాలాడుతోంది. నేనడుగుతున్నా… కాళేశ్వరం ప్రాజెక్టును ఇప్పటికే కాంగ్రెస్ మంత్రుల బృందం హెలికాప్టర్ లో పర్యటించి వచ్చింది. ఇంజనీరింగ్ నిపుణుల బృందం వెళ్లి నివేదిక కూడా ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వెళ్లి ఏం చేస్తారు? నాటకాలాడటం తప్ప… కాళేశ్వరం వల్ల రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది, అధికారంలోకి వస్తే సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ పని చేయడం లేదు? సిట్టింగ్ జడ్డితో విచారణకు సీజే అంగీకరించలేదు కాబట్టి తక్షణమే సీబీఐ విచారణ జరిపించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.
ఇటు సంజయ్ యాత్రతో బీజేపీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోమారు ఎంపీగా సంజయ్ ని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు..