VasanthaPanchami:
మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు.వసంత రుతువు రాకను వసంత పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వసంత పంచమిని ‘ సరస్వతి జయంతి’ లేక ‘ మదన పంచమి అని కూడా అంటారు. దేవి భాగవతం బ్రాహ్మణ పురాణం వంటి పురాణాలు ఈ పంచమి గురించి విశేషంగా చెప్పబడ్డాయి. సకల విద్యా స్వరూపిని అయిన పరాశక్తి ‘ సరస్వతి దేవి’ జన్మదినంగా పండితులు చెబుతారు.
ఇక వసంత పంచమి రోజున విద్యారంభ దినమని వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. ఈ రోజున సరస్వతి దేవి శాంతి మూర్తియై ..ఒక చేత వీణ..మరో చేత పుస్తకం..జపమాల.. అభయ ముద్రలను ధరించి ఉంటుంది. గనుక జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి దేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే విద్యా, జ్ఞాన ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం.
సరస్వతీ ఆరాధన వల్ల వాక్సుద్ధి వస్తుంది. మనిషికి మాటేప్రాణం కనుక ఈ దేవిని ఆరాధించి మనిషి సద్బుద్ధిని పొందుతాడు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అనీ పిలుస్తారు. సరస్వతీ దేవిని పూర్వం అశ్వలాయనుడు ఆరాధించి ఆ తల్లి కటాక్షం పొందాడని అంటారు. సరస్వతీ దేవి ఆరాధించే విధానం ‘సరస్వతీ రహస్యోపనిషత్’ అనే గ్రంథం తెలియపరుస్తోంది.
అందమైన తెల్లని పద్మం సరస్వతికి సింహాసనం. మధురమైన పలుకులు పలికే చిలుక ఆమెకు చెలికత్తె. వాక్కులకు సంకేతములైన వేదములు వాగ్దేవినే ఆశ్రయించి ఉంటాయి. అమ్మ మాటలకు తోడుగా మోగేది వీణ. బ్రహ్మదేవుని ముఖాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. కాబట్టి బ్రహ్మ ముఖంలో సరస్వతి ఉంటుందని శాస్త్రోక్తి.
పురాణ కథ;
శ్రీపంచమినే రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. రుతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమి నాడు పూజించడంవల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయనే లోకోక్తి కూడా ఉంది. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం.
‘‘వాగేశ్వరీ, వాగ్వాదినీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలు గల ఈ వాగ్దేవి ‘సామాంపాతు సరస్వతి’ అనే మకుటంతో ఉన్న శ్లోకాలతో పఠించడం వల్ల శారదాదేవి సంతోషించి అపార జ్ఞాన రాశిని ప్రసాదిస్తుందని పెద్దలుచెప్తారు.
అదిలాబాద్ జిల్లాలో గోదావరి తీరాన బాసర క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీ ని ఆరాధిస్తూ ఇక్కడే వేద వ్యాసుడు తపం ఆచరించాడట. అమ్మవారి సాక్షాత్కారం పొంది అమ్మ అనుగ్రహంతోనే వేద విభజన, మహాభారతాది పురాణాలను రచించాడని అంటారు. ఈ అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలకు అమ్మకరుణ తో జ్ఞాన రాశులు అవుతారని పెద్దల నమ్మకం. ఈ రోజున సరస్వతీ దేవిని తెల్లని పూలతో పూజించాలి. అమ్మవారిని శేవత వ స్త్రాలతో కాని, పసుపు పచ్చ వస్త్రాలతో కాని అలంకరించాలి. అమ్మ వారికి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నాన్ని , నేతి పిండివంటలను, చెరకును, అరటి పండ్లను, నారికేళాన్ని నివేదన చేస్తే మంచిఫలితాలు వస్తాయని అంటారు. కుల మత భేదాలు లేకుండా ప్రపంచంమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్నప్పటికీ మాఘ మాసంలో వచ్చే ఈ పంచమి తిథి ప్రత్యేకత సంతరించుకొంది.