Valentine’sday: భగ్న_ప్రేమికుల_దినోత్సవం…

విశీ:

“పెళ్లయ్యాక నువ్వు చర్చిలో మా మతం పుచ్చుకుంటావా? లేక నేను గుడికొచ్చి మీ మతం తీసుకోవాలా” అని ముందే కూలంకషంగా చర్చించుకునే ప్రేయసీ ప్రేమికులకు..

“ఎంతైనా మీ కులం వాళ్లకు మా కులం వాళ్లంటే ఇష్టం. వెంట పడి మరీ మమ్మల్ని పడేస్తారు” అని సరదాగా సీరియస్ కామెంట్లు చేసే ప్రేమికురాళ్లకు..

“మా మతంలో ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. కాబట్టి నువ్వే మా మతంలోకి మారిపో” అని సింపుల్‌గా ఆదేశాలు జారీ చేసే ప్రేమికులకు..

“నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కానీ మా వాళ్లకు చాలా ఉంది. నిన్ను అస్సలు యాక్సెప్ట్ చేయరు” అని సూటిగా కులతత్వం బయటపెట్టే ప్రేమికురాళ్లకు..

“మా కులంలో పెళ్లికి కనీసం పది లక్షలు కట్నం ఇస్తారు. నిన్ను లవ్ చేసి అదంతా వదిలేసుకున్నాను తెలుసా?” అని సరదాగానే నిజాలు బయటకు చెప్పేసే ప్రేమికులకు..

“నువ్వు చాలా పద్ధతిగా, చక్కగా ఉన్నావ్! అసలు ఆ కులంలో పుట్టావంటే ఎవరూ నమ్మరు” అని కులం ప్రాధాన్యాన్ని నూరిపోసే ప్రేమికురాళ్లకు..

“నీ కులం ఏదైనా సరే! కానీ మతం వేరంటే మా వాళ్లు ఒప్పుకోరేమో? వాళ్లు అడిగితే మా మతం అనే చెప్పేయ్” అని ముందస్తు జాగ్రత్తలు చెప్పే ప్రేమికులకు..

“మన మతాలు వేరైనా సరే, పిల్లలు మాత్రం ఒకే మతంలో, అదీ మా మతంలోనే పెరగాలి” అని కండీషన్లు పెడితే ప్రేమిక పురుష పుంగవులకు..

“నా వెంట నువ్వూ ప్రేయర్‌కి రా! అప్పుడే మా వాళ్లకు నీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది” అని బలవంతంగా మతాన్ని రుద్దే ప్రేమిక స్త్రీ రత్నాలకు..

“నువ్వు మా మతంలో పుట్టి ఉంటే ఏం పోయేది?” అని వగచే ప్రేమికులకు, “నువ్వు నా అత్త కొడుకు అయ్యుంటే ఎంత బాగుండేది” అని ఏడిచే ప్రేమికురాళ్లకు..

“నా మీద ప్రేమ, ఇష్టం ఉంటే ఇది చదువు” అంటూ బలవంతంగా బైబిళ్లు చేతిలో పెట్టేవారికి, “నాకోసం గుడికి రా” అని ఆదేశాలు జారీ చేసి బొట్లు పెట్టించేవారికి..

ప్రేమ పెళ్లిళ్లు జరిగిన ఏడాది తర్వాత కట్నాల గురించి చర్చించే పెద్దలకీ..

ప్రేమికులకు పుట్టిన పిల్లల్ని పట్టుకొని “మీ పేర్లేంటి? మీ కులం ఏమిటి? మీరు చర్చికి వెళ్తారా? గుడికి వెళ్తారా?” అని గుచ్చి గుచ్చి అడిగే వారికి..

వీళ్లందర్నీ మంచి..

Love is Devine అంటూ, పెద్ద పెద్ద సోది కబుర్లు చెప్తూ, బయటి సమాజానికి ఆదర్శవాదుల్లా కనిపిస్తూ, ఇళ్లల్లో జీవిత భాగస్వాములను తమ మతమే పాటించేలా ఒత్తిడి చేస్తున్న ‘భగ్న ప్రేమికులకు’ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు..