Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో శుభకార్యాలు సాధారణంగా నిర్వహించరు. కానీ అదే సమయంలో, ఈ మాసం అనేక ఆధ్యాత్మిక వ్రతాలకు, అనుష్ఠానాలకు అత్యంత ముఖ్యమైనది.

ఈ నెలలో పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేపడతారు. ఇది విశ్రాంతి, ధ్యానం, ఆత్మ పరిశుద్ధతకు చిహ్నం. ఆధ్యాత్మిక పరంగా చూస్తే, ఈ మాసం అనంత ఫలాలను ప్రసాదించేదిగా పేర్కొనబడింది.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగలు ఈ మాసంలో ఘనంగా నిర్వహించబడతాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలో జగదాంబ దేవి ఆలయంలో మొదటి గురువారం బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టడమూ, ఘట్టం ఊరేగింపులతో ఉత్సవ శోభకు అద్దం పడతాయి.

ఆషాఢ శుద్ధ విదియనాడు పూరీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇదొక అంతర్జాతీయ పుణ్యపర్వంగా, కోటి కాంతుల విరజిమ్మే ఉత్సవంగా పేరుపొందింది.

ఆషాఢ శుద్ధ సప్తమి రోజును భాను సప్తమిగా పరిగణిస్తారు. ఈ రోజున “వివస్వన్నమో భాస్కరస్సోత్పత్తిః” అంటూ సూర్య భగవానునికి విశేష పూజలు జరుపుతారు.

*తొలి ఏకాదశి*

ఈ మాసంలోని శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశిగా, తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున మహావిష్ణువు పాల సముద్రంలో శయనానికి వెళ్లాడని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఏకాదశినాడు సతీసక్కుబాయి చేసిన వ్రతం వల్ల విఠల భగవానుని సాక్షాత్కారాన్ని పొందినట్లు వర్ణించబడింది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశివరకు నాలుగు నెలలు మహావిష్ణువు నిద్రిస్తాడు. ఈ కాలంలో నియమాలు పాటిస్తూ వ్రతాచరణలు చేయడం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఈ మాసంలో వ్యాస భగవానుని జయంతి (గురుపౌర్ణిమ) జరుపుతారు. గురువు తత్వాన్ని స్మరించే పవిత్రమైన రోజుగా, ఇది ఆధ్యాత్మిక విద్యార్థులకు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజు.
ఆషాఢ బహుళ అమావాస్యను దీప పూజకు ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. అలాగే కర్కాటక సంక్రమణంతో దక్షిణాయనం ప్రారంభమై, పితృదేవతలకు శ్రాద్ధకర్మలు ప్రారంభం అవుతాయి.

ఆషాఢ మాసం ఆరోగ్యపరంగా అపచార మాసంగా పేర్కొనబడుతుంది. ఈ కాలంలో కొత్తనీరు తాగటం, బహిరంగ భోజనాలు చేయటం వల్ల అనారోగ్యాలు వస్తాయని నమ్మకం. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ కాలం అనుకూలం కాదని శాస్త్రవివరణ ఉంది.

ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆరోగ్య పరిరక్షణకు సూచించబడిన చర్య. గోరింటాకులో ఉన్న ఔషధ గుణాలు శరీరాన్ని చల్లబరుస్తాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయుర్వేద విశ్లేషణలు చెబుతున్నాయి.

*ఆషాఢ వైభవం*

ఈ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మకు శాకంబరీ అలంకార ఉత్సవాలు, ఉజ్జయినీ మహంకాళికి బోనాల జాతర, పూరీ రథయాత్ర వంటి ఎన్నో వైభవోపేతమైన కార్యక్రమాలు జరుగుతాయి.

ఆషాఢ మాసం అనేది శూన్య మాసం కాదు, పుణ్యమాసం. శుభకార్యాలకు విరామం ఇస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందించుకునే సమయం. నియమ నిష్ఠలతో జీవిస్తూ, వ్రతాలు ఆచరిస్తూ, అమ్మవారి ఆరాధనలో భాగస్వాములమవుదాం. మన చరిత్ర, పరంపరలకు అనుగుణంగా ఆచారాలు పాటిద్దాం. పూజా ఫలితాలు పొందుదాం.

శుభమస్తు!

_ ఏఎన్ఆర్✍

Optimized by Optimole