Tollywood: తెలుగు సినీ చరిత్రలో ఆల్‌టైమ్ క్లాసిక్ ‘ముత్యాల ముగ్గు’ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నేళ్లు గడిచిన ఈ కళాత్మక చిత్రానికి ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. రామాయణాన్ని సామాజిక నేపథ్యంతో మలిచి, వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు బాపు.ఇక రమణ రచన సంభాషణలు అప్పట్లోనే తూటాల్లా పేలాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్ రావుగా గోపాలరావు పలికిన డైలాగులు రికార్డు ప్లేట్ల రూపంలో విడుదలై సంచలనం సృష్టించాయి. రమణ మార్క్ సంభాషణలు ..మాటల్లో ముత్యాల బుట్ట. పాటల్లో మణిహారం.బాపు సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే – ప్రతి ఫ్రేమ్ ఓ కళాఖండమే. 50 ఏళ్లైనా అలానే ఉంటుంది అంటే అది ఒక చిత్రకారుని నిష్ణాతత్వానికి నిదర్శనం.
ఈ చిత్రాన్ని చూసిన అనంతరం మహాకవి శ్రీశ్రీ ఓ పత్రికలో ఇలా ప్రశంసించారు:
“ముత్యాల ముగ్గు
రత్నాల రగ్గు
దెయ్యాల దగ్గు
సత్యాల నిగ్గు”
ఈ వ్యాఖ్య చూసిన బాపు – రమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. “అయన ఏం అన్నాడో ఆయనకైనా తెలుసా?” అనుకుని, కొంత ఆలోచించి, “మహాకవి ఏమన్నాడన్నది కాదు.. అసలు ఏదో అన్నాడు కదా, అదే పదివేలు!” అంటూ హాస్యంగా స్పందించారట.
ఇది కేవలం ఓ సినిమా కాదు.. తెలుగు చలన చరిత్రలో ఓ కళాఖండం. బాపు – రమణ కలయికకు అర్థశతాబ్దపు నివాళిగా నిలిచే అద్భుత కళాకావ్యం!