spiritual: మౌనం_ మనిషిని మనిషిగా నిలబెట్టే మహా సాధన..!!

Spiritual:

BY anrwriting ✍🏽/ senior journalist 

మౌనం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు…అది ఒక జీవన శైలి, ఒక ఆత్మశుద్ధి మార్గం. రోజూ కేవలం అరగంట మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మాత్రమే కాదు,మన ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు సైతం నెరవేరుతాయంటే నమ్మగలమా?సాధారణంగా నమ్మలేం. కానీ ఇది అనుభవసిద్ధమైన సత్యం. ప్రయత్నిస్తే తప్పక తెలుస్తుంది. మౌనం ఎంత శక్తివంతమైందో. మన రోజువారీ జీవితాన్ని ఒకసారి గమనించండి.ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ఎంతసేపు మాట్లాడుతున్నాం?
ఎంతసేపు నిజంగా మౌనంగా ఉన్నాం?

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నామనుకుంటాం. కానీ నిజమేనా అది?
నోరు మూసుకుని ఉన్నా మనసు మాత్రం ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. ఆలోచనలు, ఆందోళనలు, జ్ఞాపకాలు… ఇవన్నీ మనల్ని మన నుంచే దూరం చేస్తుంటాయి.

నిపుణులు చెప్పేది ఒక్కటే ఇదే నిజమైన మౌనం కాదు. ఇంటిపనులు చేస్తూ,టీవీ చూస్తూ, మొబైల్ లేదా కంప్యూటర్‌లో మునిగి ఉండటం మౌనం కాదు.
నోరు మాట్లాడకపోయినా, మనసు మాట్లాడుతూనే ఉంటే అది శబ్దంతో సమానమే. అయితే నిజమైన మౌనం ఏది? కళ్ళు మూసుకుని… మాటను ఆపి…
మనసును కూడా నెమ్మదిగా మౌనంలోకి జార్చగలిగితే కేవలం పది నిమిషాలు చాలు. ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక అపూర్వమైన హాయితనం,మనసునిండా ప్రశాంతత.

మౌనం మనల్ని మనకు దగ్గర చేస్తుంది. రోజంతా జరిగిన మాటలు, వాదనలు, కోపాలు, అపార్థాలు అన్నీ మనసులో చేరి భారంగా మారతాయి. ఆ భారాన్ని దించుకునే మార్గం చాలా సింపుల్ కొద్దిసేపు మౌనం. దాన్ని ధ్యానం అనండి… మెడిటేషన్ అనండి… ప్రాణాయామం అనండి… పేరేమైనా కావచ్చు. ఏకాగ్రతతో శ్వాసపై దృష్టి పెట్టగలిగితే చాలు చికాకు క్షణాల్లో కరిగిపోతుంది.

మౌనం ఇంకో అద్భుతం చేస్తుంది.మన మాటలకు విలువ పెరుగుతుంది.

ఎలా అంటే మౌనం మనల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది.
అంతర్ముఖత నుంచి ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి మాటలు ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా ఉంటాయి. అనవసరమైన కబుర్లు, భయం, బెదురు ఉండవు.అలాంటి మాటలే ఎదుటివారిలో మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతాయి. ఆచి తూచి మాట్లాడటం బలహీనత కాదు. అది తన మాటలపై, తన ఆలోచనలపై తనకున్న పట్టుకు నిదర్శనం.

ఎందుకంటే చేజారిన కాలం, పెదవి దాటిన మాట మళ్లీ వెనక్కి రావు.

ఉదయం లేచిన దగ్గర నుంచే విభిన్న అనుభూతులు, భావపరంపరలు మన మనసును ఆక్రమిస్తుంటాయి. అవి ఒత్తిడిగా మారి మన మాటలపై, చేతలపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. ఆ ప్రభావం మళ్లీ మన మనసుపై… ఇలా ఒక చెడు చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రాన్ని ఆపే శక్తి మన చేతుల్లోనే ఉంది. అదే మౌనం.

ఆ మౌనంలో ఆలోచనలు లేకుండా, ప్రశాంతంగా మనసుతో మమేకమై కనీసం పది నిమిషాలు గడిపితే చాలు. ఫలితం ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆ ప్రశాంతతను రుచి చూసాక మీరు గానే మరో పది మందికి దాని గురించి చెబుతారు.

Optimized by Optimole